ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ లాకర్ | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ లాకర్

Published Wed, Aug 19 2015 1:15 AM

ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ లాకర్

న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ఆటోమేటెడ్ డిజిటల్ లాకర్ ‘స్మార్ట్ వాల్ట్’ను ఆవిష్కరించింది. పిన్ నంబరుతో పాటు బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ లాంటి ఫీచర్లతో ఈ లాకర్లు అత్యంత సురక్షితమైనవిగా ఉంటాయని బ్యాంక్ ఎండీ చందా కొచర్ తెలిపారు. బ్యాంకు శాఖల సిబ్బంది ప్రమేయం లేకుండా.. వారాంతాల్లోనూ, బ్యాంకింగ్ పనివేళలు ముగిసిన తర్వాత కూడా వీటిని ఉపయోగించుకునే వీలు ఉంటుందని స్మార్ట్ వాల్ట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె వివరించారు.

మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీని రూపకల్పన, తయారీ అంతా కూడా దేశీ సంస్థల భాగస్వామ్యంలోనే జరిగిందని చందా కొచర్ పేర్కొన్నారు. రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించిన ఈ లాకర్లు.. రెండు, మూడు పరిమాణాల్లో లభిస్తాయని, సైజును బట్టి, నగరాన్ని బట్టి చార్జీలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న నేపథ్యంలో వడ్డీ రేట్లు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టగలవని చందా కొచర్ తెలిపారు. కీలక పాలసీ రేట్ల తగ్గుదల ప్రయోజనాలను చాలా మటుకు ఇప్పటికే ఖాతాదారులకు బదలాయించడం జరిగిందని ఆమె వివరించారు. బ్యాంకులకు డిపాజిట్ల సమీకరణ వ్యయాలు తగ్గుతున్న కొద్దీ.. వడ్డీ రేట్లు కూడా తగ్గుతూ వస్తాయని చెప్పారు.

Advertisement
Advertisement