ఐసీఐసీఐ లాభం జూమ్ | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ లాభం జూమ్

Published Sat, Aug 1 2015 12:18 AM

ఐసీఐసీఐ లాభం జూమ్

 క్యూ1లో రూ. 2,976 కోట్లు; 12 శాతం పెరుగుదల
♦ మొత్తం ఆదాయం రూ. 15,802 కోట్లు; 8 శాతం వృద్ధి
♦ 14 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం; రూ.5,115 కోట్లు
 
 ముంబై : ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో స్టాండెలోన్ ప్రాతిపదికన(బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే) రూ.2,976 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2,655 కోట్లతో పోలిస్తే లాభం 12 శాతం ఎగసింది. మొండిబకాయిల పెరుగుదల కొనసాగినప్పటికీ.. ఇక ఈ సమస్య క్రమంగా సద్దుమణుగుతుందంటూ బ్యాంక్ సంకేతాలివ్వడం ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ఫలితాలు కూడా మార్కెట్ వర్గాల అంచనాలను మించడంతో షేరు ధర 6 శాతానికి పైగా దూసుకెళ్లింది. కాగా, క్యూ1లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.14,617 కోట్ల నుంచి రూ.15,802 కోట్లకు పెరిగింది. 8% వృద్ధి నమోదైంది. ఇక కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) బ్యాంక్ నికర లాభం జూన్ క్వార్టర్‌లో 14 శాతం ఎగసి రూ.3,232 కోట్లకు దూసుకెళ్లింది.

 మొండిబకాయిలు పెరిగాయ్...
 జూన్ క్వార్టర్ నాటికి మొత్తం రుణాల్లో బ్యాంక్ స్థూల మొండిబకాయిల వాటా (ఎన్‌పీఏ) 3.68 శాతానికి చేరింది. క్రితం ఏడాది ఇదే కాలానికివి 3.05 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా రూ.10,843 కోట్ల నుంచి రూ.15,138 కోట్లకు చేరాయి. అయితే, మార్చితో ముగిసిన క్వార్టర్‌లో 3.78 శాతంతో పోలిస్తే స్థూల ఎన్‌పీఏలు కాస్త తగ్గడం గమనార్హం. నికర ఎన్‌పీఏల విషయానికొస్తే.. గతేడాది క్యూ1లో 0.99 శాతం నుంచి ఈ క్యూ1లో 1.58 శాతానికి ఎగబాకాయి. మొండిబకాయిల ప్రొవిజన్స్ (కేటాయింపులు) రూ.726 కోట్ల నుంచి రూ.956 కోట్లకు పెరిగాయి.

 ఇతర ముఖ్యాంశాలివీ...
►క్యూ1లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 14 శాతం ఎగబాకింది. రూ.4,492 కోట్ల నుంచి రూ.5,115 కోట్లకు చేరింది.
►వడ్డీయేతర ఆదాయం 5% వృద్ధితో రూ.2,850 కోట్ల నుంచి రూ.2,990 కోట్లకు పెరిగింది.
►నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) కూడా 3.4 శాతం నుంచి 3.54 శాతానికి పుంజుకుంది.
►సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు 14 శాతం వృద్ధి చెందాయి. రిటైల్ రుణాల్లో 25 శాతం పెరుగుదలను బ్యాంక్ నమోదు చేసింది. కార్పొరేట్ రుణాలు 9 % పెరిగాయి.
►అనుబంధ సంస్థలైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం రూ.382 కోట్ల నుంచి రూ.397 కోట్లకు పెరిగింది. ఐసీఐసీఐ లాంబార్డ్ లాభం 61 శాతం ఎగబాకింది. రూ.72 కోట్ల నుంచి రూ.116 కోట్లకు దూసుకెళ్లింది.
►మెరుగైన ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర శుక్రవారం పరుగులుతీసింది. బీఎస్‌ఈలో ఒకానొకదశలో 6 శాతంపైగా ఎగబాకి రూ.309 స్థాయిని తాకింది. అయితే చివరకు 4 శాతం లాభంతో రూ.303 వద్ద స్థిరపడింది.
 
 మొండిబకాయిల సమస్య ఇక క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. అయితే, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంపైనే ఎన్‌పీఏల తగ్గుదల ఆధారపడి ఉంటుంది. రికవరీలపై మరింతగా దృష్టిపెడుతున్నాం. ప్రధానంగా విద్యుత్ వంటి సమస్యాత్మక రంగాల్లో ఆస్తుల విక్రయం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకోవాల్సిందిగా ఆయా కంపెనీల ప్రమోటర్లకు సూచిస్తున్నాం. ప్రస్తుత మార్జిన్ల స్థాయిని కొనసాగించగలమన్న నమ్మకం ఉంది.ఈ ఆర్థిక సంవత్సరంలో 18-20% రుణ వృద్ధి లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం.
 - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ

Advertisement
Advertisement