పారిశ్రామిక ఉత్పత్తిపై తయారీ దెబ్బ | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక ఉత్పత్తిపై తయారీ దెబ్బ

Published Thu, Apr 13 2017 12:25 AM

పారిశ్రామిక ఉత్పత్తిపై తయారీ దెబ్బ

► ఫిబ్రవరిలో అసలు వృద్ధిలేకపోగా  మైనస్‌ 1.2 శాతం క్షీణత
► నాలుగు నెలల కనిష్ట స్థాయి
►తయారీ రంగం ఉత్పత్తి మైనస్‌ 2 శాతం పతనం  


న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఫిబ్రవరిలో పేలవ పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు పెరుగుదల లేకపోగా –1.2 శాతం (2016 ఫిబ్రవరితో పోలిస్తే) క్షీణించింది. నాలుగు నెలల్లో ఇలాంటి ఫలితం రావడం ఇదే తొలిసారి. తాజా ఫలితానికి మొత్తం సూచీలో దాదాపు 75 శాతంగా ఉన్న తయారీ రంగం ప్రతికూలతే కారణం.

ఈ విభాగంలో సైతం అసలు వృద్ధిలేకపోగా –2 శాతం క్షీణత నమోదయ్యింది. తయారీ రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి.  క్యాపిటల్‌ గూడ్స్, వినియోగ విభాగాల్లో ఉత్పత్తుల ధోరణి కూడా నిరాశే. 2016 ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధిరేటు 1.99 శాతం గాకా, ఈ ఏడాది జనవరిలో 3.27 శాతంగా నమోదయ్యింది.

బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను చూస్తే...
క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు సూచికయిన ఈ విభాగం 2016 ఫిబ్రవరిలో భారీగా –9.3 శాతం క్షీణత నమోదుచేస్తే, 2017లో ఈ క్షీణ రేటు –3.4 శాతంగా ఉంది.
వినియోగ ఉత్పత్తులు: వార్షికంగా 0.6 శాతం వృద్ధి 5.6 శాతం క్షీణతకు పడిపోయింది. ఇందులో ఒక భాగమైన నాన్‌–డ్యూరబుల్‌ కన్జూమర్‌ గూడ్స్‌ – 4.9 శాతం క్షీణత నుంచి మరింతగా –8.6 క్షీణ రేటుకు జారిపోయింది. డ్యూరబుల్‌ సెగ్మెంట్‌ విషయంలో 10.4% వృద్ధి –0.9% క్షీణతకు జారింది.

11 నెలల్లో...
గడచిన ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకూ 11 నెలల కాలంలో (2016 ఏప్రిల్‌–2017 ఫిబ్రవరి) పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 0.4 శాతంగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఈ రంగం వృద్ధి 2.6 శాతం. కాగా తాజా పారిశ్రామిక ఉత్పత్తి ఫలితాల నేపథ్యంలో తిరిగి పారిశ్రామిక వర్గాల నుంచి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) కోత డిమాండ్‌ ప్రకటనలు వెలువడుతున్నాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 15 శాతంగా ఉన్న పారిశ్రామిక రంగం పునరుత్తేజానికి రేటు కోత తప్పదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.

రిటైల్‌ ధరల సెగ 
మార్చిలో 3.81 శాతం అప్‌ ఐదు నెలల గరిష్టం  
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2017 మార్చిలో 3.81 శాతంగా నమోదయ్యింది. అంటే రిటైల్‌ ధరల బాస్కెట్‌ మొత్తంగా 2016 మార్చితో పోల్చితే 2017 మార్చిలో 3.81 శాతం పెరిగాయన్నమాట. మార్చికి ముందు గడచిన ఐదు నెలల కాలంలో రిటైల్‌ ధరలు ఈ స్థాయిలో  పెరగలేదు. ఫిబ్రవరిలో ఈ రేటు 3.65 శాతంగా ఉంది. గత ఏడాది మార్చి రేటు 4.83 శాతం. బుధవారంనాడు విడుదల చేసిన మార్చి గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు..

►  ఆహార ఉత్పత్తుల విషయానికి వస్తే– పాల ధరలు 4.69 శాతం పెరిగితే, పాల ఉత్పత్తుల ధరలు 3.21 శాతం ఎగశాయి. ప్రిపేర్డ్‌ మీల్స్, స్నాక్స్, స్వీట్స్‌ ధరలు 5.65 శాతం ఎగశాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం అసలు పెరక్కపోగా – 7.24 శాతం క్షీణించాయి.
►  ఇంధనం, లైట్‌ కేటగిరీలో ద్రవ్యోల్బ ణం 5.56 శాతంగా ఉంది.
►  కాగా గ్రామీణ ప్రాంతంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చిలో 3.74 శాతంగా ఉంటే, పట్టణ ప్రాంతంలో 3.88 శాతంగా నమోదయ్యింది.

Advertisement
Advertisement