ఐఐపీ భారీ విస్తరణ | Sakshi
Sakshi News home page

ఐఐపీ భారీ విస్తరణ

Published Tue, Mar 25 2014 1:33 AM

ఐఐపీ భారీ విస్తరణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) విస్తరణ దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌తోసహా దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ కేంద్రాలున్నాయి. గువహటి లో రూ.5 కోట్లతో కేంద్రం రానుంది. గుర్గావ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ఐఐపీ డెరైక్టర్ ఎన్.సి.సాహా సోమవారం తెలిపారు. ఐఐపీ హైదరాబాద్ ఎనిమిదవ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. మౌలిక వసతుల కల్పనకు ఐఐపీకి కేంద్ర వాణిజ్య శాఖ రూ.250 కోట్లు ఖర్చు చేయనుందని, ఇందులో భాగంగా రూ.70 కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. హైదరాబాద్ కార్యాలయం విస్తరణకు రూ.2 కోట్లు వ్యయం చేస్తామన్నారు.

 ‘భారత ప్యాకేజింగ్ పరిశ్రమ ప్రస్తుతం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది. రానున్న నాలుగైదేళ్లలో 12.3 శాతం వృద్ధితో నాల్గవ స్థానానికి చేరుకుంటుంది. ఆ సమయానికి మార్కెట్ పరిమాణం 42.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’ అని వెల్లడించారు. ఐఐపీ హైదరాబాద్ చైర్మన్ ఏవీపీఎస్ చక్రవర్తి మాట్లాడుతూ ఇంతకుముందు ఏ అవకాశాలూ దొరకని వారు ప్యాకేజింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో తమ పేర్లను నమోదు చేసుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని అన్నారు. ఈ రంగంలో రాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఇన్‌ఛార్జి మాదబ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement