ఒకటి...రెండు కాదు వందేళ్ల ప్రణాళిక మాది..! | Sakshi
Sakshi News home page

ఒకటి...రెండు కాదు వందేళ్ల ప్రణాళిక మాది..!

Published Thu, Apr 14 2016 12:18 AM

ఒకటి...రెండు కాదు వందేళ్ల ప్రణాళిక మాది..! - Sakshi

‘ఐకియా’ ఇండియా సీఈఓ జువెన్సియో
అందుకే ఇన్నాళ్ల సమయం తీసుకున్నాం
వచ్చే ఏడాది వేసవిలో హైదరాబాద్ స్టోర్ ఆరంభం
13 ఎకరాల్లో ఏర్పాటు; ఒక స్టోర్‌కు రూ.600 కోట్లు
2000 ఉద్యోగాలు; శాశ్వత సిబ్బంది 500 మంది
మా సిబ్బందిలో 50% మంది మహిళలుండాల్సిందే
జూన్ నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఆరంభిస్తాం
2025 నాటికి దేశంలోని 9 నగరాల్లో 30 స్టోర్లు
కళాకారుల పేర్లు కూడా మా ఫర్నిచర్‌పై ఉంటాయి

 ‘‘వందేళ్లు నడిచేటపుడు... ఆ దారి వేయటానికి మూడేళ్లు తీసుకుంటే తప్పులేదు. డబ్బులైనా ఇంతే!!. పెట్టుబడిలో 3 శాతాన్ని... తగిన రంగం సిద్ధం చేయడానికి వెచ్చిస్తే తప్పేమీ కాదు. మేం చేసిందీ అదే.’’ ఇదీ... అంతర్జాతీయ ఫర్నిచర్ దిగ్గజం ‘ఐకియా’ ఇండియా సీఈఓ జువెన్సియో మేజు మనోగతం. రూ.11,000 కోట్ల పెట్టుబడితో ఇండియాలోకి ప్రవేశిస్తున్నట్లు 2012లో ప్రకటించిన ఈ సంస్థ... తన తొలిపై నిర్ణయానికి రావటానికి మూడేళ్లు పట్టింది. హైదరాబాద్‌ను తొలి గమ్యస్థానంగా ఎంచుకున్న ఈ సంస్థ... ఐటీ హబ్ చేరువలో 13 ఎకరాలు కొనుగోలు చేసి ఈ మధ్యే పనులు కూడా ఆరంభించింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ స్టోర్‌ను ఆరంభించనున్న నేపథ్యంలో పనుల్ని పర్యవేక్షించడానికి సంస్థ సీఈఓ జువెన్సియో బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు.  ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

 సాక్షి, బిజినెస్ బ్యూరో
 ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
హైదరాబాద్ ఎండలు ఎలా ఉన్నాయి?

నేను స్పెయిన్ దక్షిణ ప్రాంతంలో పుట్టా. అక్కడా ఎండలు ఎక్కువే. నాలుగేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నాను కనక కాస్త అలవాటుపడ్డా. ఇబ్బంది లేదు.

 దేశంలో తొలి స్టోర్‌కు హైదరాబాద్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
మొదట దేశంలోని 9 ప్రధాన నగరాల్ని అనుకున్నాం. దాన్లో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీలను వడపోశాం. చివరికి హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఆధునికత, సంప్రదాయం రెండూ ఉన్నాయి. ఇంటి ఫర్నిచర్‌కు, అలంకరణ సామగ్రికి వెచ్చించాలని కోరికతో పాటు, వెచ్చించగలిగే స్తోమత ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి సొసైటీ కూడా మాకు బాగా కనెక్ట్ అయింది.

 మొదటి స్టోర్ ఆరంభమెప్పుడు?
ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది వేసవిలో స్టోర్‌ను ఆరంభిస్తాం.

 ఇండియాలో వ్యాపార పరిమాణానికి సంబంధించి లక్ష్యాలేమైనా?
వ్యాపారానికి లక్ష్యాలుండొచ్చు. ఉండాలి కూడా. కానీ మాది దీర్ఘకాల ప్రణాళిక. వందేళ్లో అంతకు మించో ఉండాలనేది మా కోరిక. అందుకే స్వల్పకాలిక లక్ష్యాలేవీ పెట్టుకోలేదు. దీర్ఘకాలానికి తగ్గ పునాది వెయ్యటమే నా బాధ్యత. నేను నా కంపెనీకి చెప్పేది కూడా ఇదే.

 ఇది కూడా ఫర్నిచర్ స్టోరే కదా? మరి మీ ప్రత్యేకతలేంటి?
స్టోర్ పరిమాణం 4 లక్షల చదరపు అడుగులు. నేనైతే దీన్నొక ఫర్నిచర్ స్టోర్‌గా కాక ఐకియా సొసైటీ పిలుస్తా. ఇక్కడ సుశిక్షితులైన, మంచి విలువలున్న సిబ్బంది ఉంటారు. వీళ్లు కేవలం ఉద్యోగులే కాదు. మా కుటుంబ సభ్యులు. తప్పనిసరిగా ఉద్యోగుల్లో 50 శాతం మంది మహిళలుంటారు. మేం అమ్మే వస్తువుల్లో కళాకారులు తయారు చేసే కుషన్ల వంటి వస్తువులపై వాళ్ల పేర్లు కూడా ఉంటాయి.

 స్టోర్లలో విదేశాల్లో మాదిరి నిబంధనలే ఇక్కడా ఉంటాయా?
అవును! అక్కడిలాగే ధరల్ని జనవరి 1న విడుదల చేస్తాం. డిసెంబరు 31వరకూ అవే ఉంటాయి. స్టోర్లలో రెస్టారెంట్లతో పాటు పిల్లలకు ప్లే గ్రవుండ్ కూడా ఉంటుంది. కుటుంబమంతా హాయిగా తిరిగి, తమ బడ్జెట్లో వచ్చే వస్తువుల్ని కొనటానికి వీలుగా 9వేల రకాల ఫర్నిచర్ సొల్యూషన్లను అందిస్తాం.

 మిగతా ఫర్నిచర్ షాపులకన్నా ధర తక్కువ ఆశించొచ్చా?
మేం పెద్దసంఖ్యలో తయారుచేసి విక్రయిస్తాం కనక ధర పోటీపడేలానే ఉంటుంది. ఇక్కడ ధర ఒక్కటే కాక... రకరకాల సొల్యూషన్లు అందిస్తాం. కాబట్టి వాళ్లకు కావాల్సిన ధరలో ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది.

 ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? సిబ్బంది నియామకాలు మొదలయ్యాయా?
ఒకో స్టోర్‌లో 500 మంది ఐకియా పర్మనెంట్ ఉద్యోగులుంటారు. వీళ్లలో 50 శాతం మహిళలే. మరో 1500 మందికి పరోక్షంగా... అంటే డెలివరీ, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ వంటి రంగాల్లో ఉపాధి దొరుకుతుంది. నియామకాలు మొదలు పెడుతున్నాం. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం జూన్ నుంచి డిసెంబరు దాకా వారికి శిక్షణ ఇస్తాం. శిక్షణ తరవాత సర్టిఫికెట్ ప్రధానం చేస్తాం. దాంతో వేరేచోట కూడా ఉద్యోగాలు దొరుకుతాయి.

 ఇండియా నుంచి కొంటున్న వస్తువుల శాతమెంత? తెలంగాణలో సప్లయర్లు ఉన్నారా?
స్టోర్లు లేనప్పటికీ చాలా సంవత్సరాలుగా ఇండియా నుంచి సోర్సింగ్ చేస్తున్నాం. దాన్నిపుడు పెంచుతున్నాం. అంతర్జాతీయంగా చూస్తే మేం సోర్సింగ్ చేస్తున్న దేశాల్లో ఇండియాది 8వ స్థానం. ఇక తెలంగాణలో ప్రస్తుతం ఒక సప్లయర్ ఉన్నారు. పెంచటానికి ప్రయత్నిస్తున్నాం. స్టోర్ తెరిచేనాటికి ఈ సంఖ్య పెరుగుతుంది. తయారు చేసేవారి నుంచి నేరుగా తేవటం మా ప్రత్యేకత. దానివల్ల కళాకారులకే డబ్బులు మిగులుతాయి. అలాగే మా రెస్టారెంట్లలో ఆహారాన్ని కూడా రైతుల నుంచే తెస్తాం.

 ఇండియాలో ఎన్ని స్టోర్లు ఏర్పాటు చేస్తారు? భవిష్యత్తులో పెట్టుబడి పెంచుతారా?
ఒక స్టోర్‌కు రూ.600 కోట్లు ఖర్చవుతుంది. హైదరాబాద్ తరవాత ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో తెరుస్తాం. 2025 నాటికి 9 ప్రధాన నగరాల్లో 30 స్టోర్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. దీనికి అనుగుణంగా పెట్టుబడి పెంచుతాం. ఒక నగరంలో ఒకే స్టోర్ ఉండాలని లేదు. పరిస్థితుల్ని బట్టి ఎక్కువ స్టోర్లూ ఉంటాయి.

 మీ ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి?
డిజైన్, పనితీరు, నాణ్యత, మన్నిక, ధర... ఇవన్నీ మా ప్రత్యేకతలే. ఎందుకంటే మంచి ఇల్లనేది ప్రతి కుటుంబం కల. భవిష్యత్తులో ఇళ్ల రేట్లు పెరిగిపోతాయి. అయినా వారి కలకు తగ్గ ఫర్నిచర్‌ను అందుబాటు ధరలో అందించాలనేది మా లక్ష్యం. మేం విక్రయించే లైట్లలో ఎల్‌ఈడీ మాత్రమే వాడతాం. అలాగే ట్యాప్‌లను తక్కువ నీరొచ్చే ఆప్షన్ ఉండేటట్లు డిజైన్ చేస్తాం. యువతకు తయారీలో శిక్షణ ఇచ్చి భవిష్యత్తు తరాలకూ పనికొచ్చేలా చేస్తాం. మా సిబ్బం దిలో మహిళలుండటంతో పాటు మా వ్యాపారం కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. స్టోర్ పైకప్పు మొత్తం సోలార్ ప్యానల్స్‌ను అమర్చుతున్నాం. అర్థవంతమైన వ్యాపారం చేస్తాం. విజయమంటే అదేనని నా నమ్మకం.

 నిర్మల్ పెయింటింగ్స్, పెంబర్తి ఇత్తడి పాత్రలు... ఇలా పేరున్న స్థానిక వస్తువుల్నీ విక్రయిస్తారా?
వాటిని యథాతథంగా విక్రయించకపోవచ్చు. కానీ వారితో కలిసి ఐకియా డిజైన్‌కు తగ్గ వస్తువుల్ని చేయిస్తాం. వాటిని విక్రయిస్తాం. మొత్తం సమాజంతో అనుసంధానమై వ్యాపారం చేయాలనేది మా లక్ష్యం.

Advertisement
Advertisement