Sakshi News home page

జీఎస్‌టీతో 1.5% అదనపు వృద్ధి: పరిశ్రమ చాంబర్లు

Published Thu, May 7 2015 1:07 AM

జీఎస్‌టీతో 1.5% అదనపు వృద్ధి: పరిశ్రమ చాంబర్లు

న్యూఢిల్లీ: లోక్‌సభలో వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లు ఆమోదం పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కొత్త పన్నుల వ్యవస్థ అమల్లోకి రావడం వల్ల భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు అదనంగా 1.5 శాతం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. దేశ వ్యాప్తంగా ఉమ్మడి మార్కెట్ ఏర్పాటు వల్ల బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని సైతం పారిశ్రామిక రంగం పేర్కొంది.
 సీఐఐ: ఏకైక మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించే క్రమంలో ఇది తొలి అడుగని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు.

పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి సైతం ఇది ప్రయోజనం చేకూర్చే అంశమని వివరించారు. వాణిజ్య విస్తృతి, వృద్ధికి జీఎస్‌టీ అమలు దోహదపడుతుందని అన్నారు. తమ రెవెన్యూ వసూళ్లు పెరగడం వల్ల రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయని వివరించారు.
 
అసోచామ్: భారత్ పటిష్ట సంస్కరణల దిశలో నడుస్తోందని అంతర్జాతీయంగా పెట్టుబడిదారులకు ‘లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం’ ఒక సంకేతం ఇచ్చిందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు.
 
పీహెచ్‌డీ చాంబర్
భారత్ ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక గొప్ప మార్పు అని పీహెచ్‌డీ చాంబర్ ప్రెసిడెంట్ అలోక్ బీ శ్రీరామ్ అన్నారు. దేశంలో సంక్లిష్ట పన్ను వ్యవస్థ సరళీకరణకు ఈ పరిణామం దోహదపడుతుందని వివరించారు.

Advertisement
Advertisement