తెవా ‘కొనుగోలు’ ఆఫర్‌కు మైలాన్ నో | Sakshi
Sakshi News home page

తెవా ‘కొనుగోలు’ ఆఫర్‌కు మైలాన్ నో

Published Tue, Apr 28 2015 12:58 AM

తెవా ‘కొనుగోలు’ ఆఫర్‌కు మైలాన్ నో

‘క్యాష్ అండ్ స్టాక్’ ప్రతిపాదన తగినంత లేదని వివరణ
న్యూయార్క్: ఇజ్రాయిల్ కేంద్రంగా పనిచేస్తున్న తెవా 40.1 బిలియన్ డాలర్ల కొనుగోలు ఆఫర్‌ను  యూకే అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ మైలాన్ లాబొరేటరీస్ తిరస్కరించింది. తెవా ‘క్యాష్-అండ్-స్టాక్’ ప్రతిపాదన మైలాన్ విలువను తక్కువగా చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. షేర్‌కు 82 డాలర్ల చొప్పున తెవా ‘బయ్‌అవుట్’ ఆఫర్ ఇచ్చింది. తాజా తిరస్కృతి నేపథ్యంలో... మరో ఆఫర్‌కు మైలాన్ తలుపులు తెరిచే ఉంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తొలి ఆఫర్ ప్రకారం అప్పటి మైలాన్ షేర్ ధరతో పోల్చితే తెవా ఆఫర్ 21 శాతం అధికం. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో మైలాన్ షేర్ ధర 3.56 డాలర్లు పతనమై (4.7 శాతం) 72.50 డాలర్లుకు తగ్గింది.
 
నేపథ్యం ఇదీ...
ఈ వారం మొదట్లో మైలాన్‌ను బలవంతంగా కొనుగోలు చేయడానికి తెవా ఫార్మా ఏకంగా 40.1 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇవ్వటంతో సంచలనం మొదలైంది. అయితే ఈ బిడ్‌ను తప్పించుకోడానికి మైలాన్ మొదటినుంచీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే  అమెరికన్ ఫార్మా దిగ్గజం పెరిగోను కొనుగోలు చేయడానికి మైలాన్ లాబొరేటరీస్ రంగంలోకి దిగిందని సంబంధిత వర్గాల కథనం.

ఒకవేళ పెరిగోను మైలాన్ కొనుగోలు చేస్తే ఈ రెండింటినీ కలిపి కొనేంత శక్తి తెవాకు ఉండదు.  ఈ ఆలోచనతో 29 బిలియన్ డాలర్లకు పెరిగోను కొనుగోలు చేసేలా... ఆ కంపెనీ షేర్ హోల్డర్లకు మైలాన్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ మేరకు... పెరిగో కంపెనీ వాటాదార్లకు ఒకో వాటాకు 60 డాలర్లతో పాటు మైలాన్‌కు చెందిన 2.2 షేర్లు కూడా ఇస్తారు. దీనిప్రకారం ఒకో పెరిగో షేరుకు 222.12 డాలర్లు చెల్లించినట్లవుతుంది. అయితే పెరిగో యాజమాన్యం మాత్రం ఈ బిడ్ చాలా తక్కువని దీనిని తిరస్కరించింది.

తెవా ఆఫర్ వల్లే మైలాన్ షేరు ధర బాగా పెరిగిందని, ఆ పెరిగిన ధర ప్రకారం మైలాన్‌కు చెందిన రెండు షేర్ల విలువను లెక్కిస్తున్నారు తప్ప ఆఫర్‌కన్నా ముందు మైలాన్ ధరను పరిగణనలోకి తీసుకోవటం లేదని పెరిగో పేర్కొంది. తమ కంపెనీకి ఉన్న భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ ధర చాలా తక్కువని వివరించింది. ‘యాంటీట్రస్ట్’ అభ్యంతరాలతో రెగ్యులేటర్లు తెవా ఆఫర్‌ను తిరస్కరించే అవకాశం ఉందని కూడా మైలాన్ అంతక్రితం ప్రకటించడం గమనార్హం.

Advertisement
Advertisement