బంగారానికి డిజిటల్‌ మెరుపులు! | Sakshi
Sakshi News home page

బంగారానికి డిజిటల్‌ మెరుపులు!

Published Thu, Mar 22 2018 1:29 AM

Increasing investments in digital gold - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్‌ బంగారం ప్లాట్‌ఫామ్‌లు జోరందుకుంటున్నాయి. ఎందుకంటే... డిజిటల్‌ బంగారాన్ని ఇష్టపడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం, వ్యాలెట్ల విస్తరణతో అర చేతి నుంచే క్షణాల్లో క్రయవిక్రయాలు చేయగలగటం... నోట్ల రద్దు తర్వాత, బంగారం కొనుగోళ్లపై నిఘా పెరగడం... ఇవన్నీ జనాన్ని డిజిటల్‌ గోల్డ్‌ వైపు నడిపిస్తున్నాయి. ఫలితం... 34 బిలియన్‌ డాలర్ల దేశీ బంగారం మార్కెట్లో డిజిటల్‌ శకం మొదలైందని చెప్పొచ్చు.

రూపాయి ఉన్నా చాలు...
భౌతికంగా బంగారం కొనాలంటే కనీసం అర గ్రాము (రూ.1,500) కొనాలి. అదే డిజిటల్‌ రూపంలో కొనాలంటే రూపాయితోనూ సాధ్యమే. పేటీఎం ఈ అవకాశం కల్పిస్తోంది. మిగిలిన సంస్థలూ చాలా స్వల్ప పరి మాణం నుంచి బంగారం కొనేందుకు అనుమతిస్తున్నాయి. ప్రభుత్వ రంగ ఎంఎంటీసీ, స్టిట్జర్లాండ్‌కు చెందిన బంగారం రిఫైనరీ కంపెనీ పీఏఎంపీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. డిజిటల్‌ రూపంలో కొన్న బంగారానికి సమాన పరిమాణంలో వాల్ట్‌లలో బంగారాన్ని ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు కూడా. భౌతికంగా బంగారం కావాలంటే అదనపు చార్జీలు భరించగలిగితే నేరుగా ఇంటికే డెలివరీ చేస్తారు.

భౌతిక బంగారంపై మక్కువ
వాస్తవానికి ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోళ్లనేవి మనకు కొత్త గానీ, అంతర్జాతీయంగా ఎప్పటి నుంచో ఈ ధోరణి కొనసాగుతోంది. ఆభరణాలు, బంగారం రూపంలో మన దగ్గర బహమతులిచ్చే ధోరణి బలంగా ఉండటమే కారణం. అయితే, డిజిటల్‌ రూపంలోనూ బహమతిగా ఇచ్చే విధానం ఇప్పుడిప్పుడే మన దగ్గర ప్రారంభమైంది. ‘‘భారత్‌లో ఇప్పుడే మార్పు మొదలైంది. ఆర్థిక వ్యవస్థ డిజిటైజేషన్‌తో బంగారంలోనూ డిజిటైజేషన్‌ మొదలైంది’’ అని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ దేశీయ ఎండీ సోమసుందరం తెలిపారు. రానున్న 12– 24 నెలల్లో డిజిటల్‌ గోల్డ్‌ భారీగా వృద్ధి చెందేందుకు అవకాశాలున్నాయని చెప్పారాయన. దేశీయంగా బంగారానికి డిమాండ్‌ 2017లో 727 టన్నులుండగా, అది ఈ ఏడాది 800 టన్నులుంటుందని అంచనా. భారతీయ వివాహాలు, వేడుకల్లో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా భౌతిక బంగారానికి డిమాండ్‌ తగ్గదని, ఇప్పటికీ భారీ మొత్తంలో సంప్రదాయ రూపంలోనే కొనుగోళ్లు జరుగుతున్నాయని థింక్‌ మార్కెట్స్‌ యూకే చీఫ్‌ నయీమ్‌ అస్లామ్‌ తెలిపారు.

భద్రత, నష్టం ఉండదు...
మిగులు నిధులున్నప్పుడు డిజిటల్‌ రూపంలో బంగారం కొంటే అవసరమైనప్పుడు ఫిజికల్‌గా బంగారం డెలివరీ తీసుకోవడం లేదా ఆన్‌లైన్‌లోనే విక్రయించేసి ఆభరణాల దుకాణానికి వెళ్లి కొనుక్కోవటం చేయొచ్చు. డిజిటల్‌ రూపంలో పొదుపునకు కూడా ఇది వీలు కల్పిస్తుంది. పైగా భద్రత సమస్య ఉండదు. ఇవన్నీ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. పేటీఎం 2017 ఏప్రిల్‌లో డిజిటల్‌ గోల్డ్‌ విక్రయాలను ప్రారంభించగా, తొలి ఆరు నెలల్లో 18.4 మిలియన్‌డాలర్ల విలువైన (సుమారు రూ.120 కోట్లు) అమ్మకాలు జరిపింది. లావాదేవీల్లో ఉన్న సౌకర్యానికి తోడు చిన్న మొత్తం నుంచి సరసమైన ధరకు కొనుగోలు చేసే అంశం వారిని ఆకర్షిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కొన్ని సంస్థలు డిజిటల్‌ గోల్డ్‌ ఆధారిత పొదుపు పథకాలను కూడా ఆరంభించాయి.

మున్ముందు ఈ ఆసక్తి పెరిగే అవకాశం...
కస్టమర్లలో ఆసక్తి పెరుగుతుందన్న అంచనాతో... పేటీఎం ఇటీవలే బంగారం గిఫ్ట్, సేవింగ్‌ పేరుతో రెండు పథకాలను ప్రారంభించింది. ఈ సంస్థ ఎంఎంటీసీ, పీఏఎంపీ సహకారంతో ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోళ్లకు వీలు కల్పిస్తోంది. కావాలంటే డిజిటల్‌ రూపంలో, కోరుకుంటే భౌతిక రూపంలోనూ డెలివరీ తీసుకోవచ్చు. దీనికి ఓ సీజన్‌ అంటూ లేదని, వారంలో అన్ని రోజులు, రోజులో అన్ని గంటల్లో, ఎక్కడున్నా సరే వ్యాలెట్‌ నుంచే క్రయవిక్రయాలు జరపొచ్చని ఎంటీసీ, పీఏఎంపీ మార్కెటింగ్‌ జనరల్‌ మేనేజన్‌ గౌరవ్‌ సింగ్‌ తెలిపారు. తమ కస్టమర్లలో 70 శాతం 35 ఏళ్లలోపు వారేనని, గత డిసెంబర్‌నాటికి 14 లక్షల మంది యూజర్ల ఈ వ్యాలెట్లలో బంగారం నిల్వలున్నాయని పేటీఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నితిన్‌ మిశ్రా తెలిపారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement