చైనాతో వాణిజ్య లోటు డౌన్‌ | Sakshi
Sakshi News home page

చైనాతో వాణిజ్య లోటు డౌన్‌

Published Fri, Jul 3 2020 12:31 AM

India Facing Trade Deficit Crisis  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గించుకోవడంతో 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆ దేశంతో భారత వాణిజ్య లోటు 48.66 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. ఇది 2018–19లో 53.56 బిలియన్‌ డాలర్లుగాను, 2017–18లో 63 బిలియన్‌ డాలర్లుగాను నమోదైంది. తాజాగా 2019–20లో చైనాకు ఎగుమతులు 16.6 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 65.26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చైనాతో ఆందోళనకర స్థాయిలో భారీగా ఉంటున్న వాణిజ్య లోటును, ఆ దేశంపై ఆధారపడటాన్నీ తగ్గించుకునేందుకు భారత్‌ కొన్నాళ్లుగా పలు చర్యలు తీసుకుంటోంది.

పలు ఉత్పత్తులకు సంబంధించి సాంకేతిక, నాణ్యతా నిబంధనలను సవరిస్తోంది. ఇందులో భాగంగానే దేశీ సంస్థలను దెబ్బతీసేంత చౌక రేటుతో భారత్‌లో చైనా కుమ్మరిస్తున్న పలు ఉత్పత్తులపై యాంటీ–డంపింగ్‌ సుంకాలు విధిస్తోంది. సాంకేతిక ఆంక్షల రూపకల్పనకు 371 ఉత్పత్తులను గుర్తించింది. వీటిల్లో ఇప్పటికే 150 పైగా ఉత్పత్తులకు నిబంధనలు రూపొందించింది. వీటి దిగుమతుల విలువ దాదాపు 47 బిలియన్‌ డాలర్ల మేర ఉంటుంది. ఇక నాణ్యతాపరమైన ఆంక్షల విషయానికొస్తే.. గడిచిన ఏడాది కాలంలో 50 పైగా క్వాలిటీ కంట్రోల్‌ ఆర్డర్లు (క్యూసీవో), ఇతరత్రా సాంకేతిక నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. ఎలక్ట్రానిక్‌ గూడ్స్, బొమ్మలు, ఎయిర్‌ కండీషనర్లు, సైకిళ్ల విడిభాగాలు, రసాయనాలు, సేఫ్టీ గ్లాస్, ప్రెజర్‌ కుకర్లు, ఉక్కు ఉత్పత్తులు, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులు మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.  

దిగుమతుల్లో 14 శాతం వాటా  
భారత దిగుమతుల్లో చైనా వాటా సుమారు 14 శాతంగా ఉంటుంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల్లో ప్రధానంగా మొబైల్‌ ఫోన్స్, టెలికం, విద్యుత్‌ పరికరాలు, గడియారాలు, వాయిద్య పరికరాలు, బొమ్మలు, స్పోర్ట్స్‌ గూడ్స్, ఫర్నిచర్, మ్యాట్రెస్‌లు, ప్లాస్టిక్, ఎలక్ట్రికల్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రసాయనాలు, ఉక్కు, ఇనుము ఉత్పత్తులు, ఎరువులు, ఫార్మా ముడిపదార్థాలు, లోహాలు మొదలైనవి ఉంటున్నాయి.

తగ్గిన ఎఫ్‌డీఐలు.. 
వాణిజ్య లోటుతో పాటు చైనా నుంచి భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) కూడా పరిమాణం కూడా తగ్గింది. 2018–19లో 229 మిలియన్‌ డాలర్లుగా ఉన్న చైనా ఎఫ్‌డీఐలు 2019–20లో 163.78 మిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 2000 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో చైనా నుంచి భారత్‌లోకి 2.38 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ఎక్కువగా ఆటోమొబైల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్‌ పరికరాలు, సర్వీసులు, ఎలక్ట్రానిక్స్‌లోకి ఈ ఎఫ్‌డీఐలు వచ్చాయి. భారత్‌తో సరిహద్దులున్న పొరుగు దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలకు సంబంధించి నిబంధనలను కేంద్రం ఇటీవల ఏప్రిల్‌లో కఠినతరం చేసింది. వీటి ప్రకారం ఆయా దేశాలకు చెందిన కంపెనీలు, వ్యక్తులు ఈ రంగంలో ఇన్వెస్ట్‌ చేయాలన్నా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. 

Advertisement
Advertisement