2016లో టాప్ మార్కెట్ గా భారత్ | Sakshi
Sakshi News home page

2016లో టాప్ మార్కెట్ గా భారత్

Published Wed, Feb 10 2016 12:45 AM

2016లో టాప్ మార్కెట్ గా భారత్

వన్‌ప్లస్ మొబైల్స్ అంచనా
మేక్ ఇన్ ఇండియా మొబైల్ వస్తోంది

వన్‌ప్లస్ ఇండియా జీఎం వికాస్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉన్న చైనా స్టార్టప్ వన్‌ప్లస్‌కు 2016లో టాప్-1 విపణిగా భారత్ నిలుస్తుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం కంపెనీకి టాప్-3 మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉంది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడం కంపెనీకి ఇప్పటి వరకు ఉన్న అడ్డంకి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంటు నుంచి మొబైళ్ల సరఫరా మార్చిలోపే ప్రార ంభం కానుంది. తద్వారా అమ్మకాలు గణనీయంగా ఉంటాయని, దీంతో భారత విపణి టాప్-1గా నిలుస్తుందని వన్‌ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. కంపెనీ అవసరాలను శ్రీసిటీ ప్లాంటు సమకూరుస్తుందని చెప్పారు. దేశీయంగా వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఇప్పట్లో ఎగుమతుల గురించి ఆలోచించడం లేదన్నారు. సంస్థకు అమ్మకాల పరంగా భారత్‌లో మూడు ప్రధాన మార్కెట్లలో తెలుగు రాష్ట్రాలు నిలిచాయన్నారు.

తొలి ఉత్పాదన వన్‌ప్లస్ ఎక్స్..
ప్రస్తుతం వన్‌ప్లస్ వన్, వన్‌ప్లస్-2, వన్‌ప్లస్-ఎక్స్ మోడళ్లను కంపెనీ దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయిస్తోంది. సంస్థకు మేక్ ఇన్ ఇండియా తొలి మోడల్‌గా వన్‌ప్లస్ ఎక్స్ నిలుస్తుంది. ప్లాంటు నుంచి డిసెంబర్‌లోనే తొలి ఉత్పాదన రావాల్సి ఉన్నా ధ్రువీకరణ కారణంగా ఆలస్యమైంది. ఇక ఉత్పత్తి నాణ్యత, పనితీరును అంచనా వేశాకే ఇతర మోడళ్లను శ్రీసిటీ ప్లాంటులో అసెంబుల్ చేస్తామని వికాస్ వెల్లడించారు. వన్‌ప్లస్-3 మోడల్ రెండో త్రైమాసికంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతానికి ఆన్‌లైన్ విక్రయాలకే పరిమితమవుతామని స్పష్టం చేశారు. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న బ్రాండ్‌గా నిలిచామని గుర్తు చేశారు.

 రూ.20-30 వేల శ్రేణిపై..
భారత్‌లో రూ.20-30 వేల ధరల శ్రేణిలో అన్ని బ్రాండ్లు కలిపి నెలకు 5-8 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ఈ విభాగం వృద్ధి రేటు గతేడాది 12 శాతముంది. 2016లో ఇది 15 శాతంపైగా ఉంటుందని ఇండియా జీఎం తెలిపారు. ఈ శ్రేణిలో టాప్-3 కంపెనీల్లో వన్‌ప్లస్ స్థానం సంపాదించిందన్నారు. కస్టమర్లు ప్రీమియం ఫోన్లను కోరుతున్నందున ఈ సెగ్మెంట్‌పైనే ఫోకస్ చేశామన్నారు. వినియోగదార్లకు కొత్త అనుభూతి ఇవ్వడం లక్ష్యంగా మోడళ్లను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. రూ.20-30 వేల ధరల శ్రేణిలో వన్‌ప్లస్ రెండు మోడళ్లను విక్రయిస్తోంది.

Advertisement
Advertisement