కార్ల విక్రయాలు జూమ్ | Sakshi
Sakshi News home page

కార్ల విక్రయాలు జూమ్

Published Mon, Dec 1 2014 11:50 PM

కార్ల విక్రయాలు జూమ్

పుంజుకున్న నవంబర్ అమ్మకాలు..
రానున్న నెలల్లో మరింత పెరగవచ్చు
ముడి చమురు ధరలు తగ్గడం ప్రయోజనకరమే
ఎక్సైజ్ సుంకం రాయితీలు మరికొంతకాలం పొడిగించాలి: కార్ల కంపెనీల అభ్యర్థన

 
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు నవంబర్‌లో పుంజుకున్నాయి. పండుగల సీజన్‌లో పెరిగి, ఏడాది చివరలో వాహన విక్రయాలు తగ్గడం రివాజు. కానీ ఈసారి అనూహ్యంగా నవంబర్‌లో వాహనాల అమ్మకాలు పెరిగాయి. వాహన పరిశ్రమలో రికవరీకి ఇది సంకేతమని నిపుణులంటున్నారు. మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా, టయోటా కంపెనీల వాహన విక్రయాలు పెరగ్గా, జనరల్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్డ్ ఇండియాలు విక్రయాలు తగ్గాయి. టాటా మోటార్స్ విక్రయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి.

వినియోగదారుల సెంటిమెంట్ కనిష్ట స్థాయిలో ఉండడం, అధికంగా ఉన్న వడ్డీరేట్లు కారణంగా డిమాండ్ తక్కువగా ఉంటోందని మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం వల్ల ఇంధన ధరలు కూడా తగ్గుతున్నాయని, దీంతో వాహన అమ్మకాలు రానున్న నెలల్లో మరింతగా పుంజుకుంటాయని చెప్పారు.

వాహన పరిశ్రమ మరింతగా కోలుకోవాలంటే కార్లపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు రాయితీలు మరికొంత కాలం పొడిగించాలని, అలాగే జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం తగ్గుతుండడంతో డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గుతోందని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు.

ఏడాది కాలంలో నాలుగు కొత్త మోడళ్లను అందించడం వల్ల అమ్మకాలు బావున్నాయని హ్యుందాయ్ కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్)రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 41 శాతం, స్కూటర్ల అమ్మకాలు 62 శాతం చొప్పున పెరిగాయని టీవీఎస్‌మోటార్ పేర్కొంది. కాగా మారుతీ సుజుకీ ఎగుమతులు 53 శాతం పెరిగాయి.

నవంబర్‌లో ఐదు లక్షలకు పైగా టూవీలర్లను విక్రయించామని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఏడాది కాలంలో కొత్తగా 150 డీలర్ల అవుట్‌లెట్లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇటీవలే కొలంబియాలో ఆరు హీరో మోడళ్లను అందిస్తున్నామని,120 అవుట్‌లెట్ల ద్వారా వీటిని విక్రయిస్తున్నామని వివరించింది. ఈ నవంబర్ నెలలోనే 150 సీసీ మోడల్ ఎక్స్‌ట్రీమ్‌లో స్పోర్టీయర్ వెర్షన్‌ను విడుదలచేశామని పేర్కొంది.

Advertisement
Advertisement