ఉద్యోగాలు కల్పిస్తేనే.. పన్ను రాయితీలు..! | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు కల్పిస్తేనే.. పన్ను రాయితీలు..!

Published Wed, Jun 7 2017 12:07 AM

ఉద్యోగాలు కల్పిస్తేనే.. పన్ను రాయితీలు..! - Sakshi

యాపిల్‌కు కేంద్రం షరతు!
న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారత్‌లో పెట్టే పెట్టుబడులు, కల్పించే ఉద్యోగాల సంఖ్య మొదలైన అంశాల ప్రాతిపదికనే ఆ సంస్థ కోరుతున్న పన్ను రాయితీల్లాంటి ప్రయోజనాలు కల్పించడంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే భారత్‌లో ఎంత ఇన్వెస్ట్‌ చేయనున్నది, ఎన్ని ఉద్యోగాలు కల్పించనున్నది మొదలైన వివరాలు తెలియజేయాల్సిందిగా ఆపిల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రత్యేకంగా ఒక కంపెనీకి వర్తించేలా పన్ను రాయితీలు కల్పించడం కాకుండా.. దేశీయంగా ఉత్పత్తికి ఊతమిచ్చేలా మొత్తం తయారీ రంగానికి ప్రయోజనాలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు వివరించాయి. భారత్‌లో తయారీ కార్యకలాపాలు విస్తరించేందుకు పన్నుపరమైన ప్రయోజనాలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని యాపిల్‌ కోరుతున్న సంగతి తెలిసిందే.  అయితే, ఆర్థిక శాఖ ఈ డిమాండ్స్‌ను తోసిపుచ్చింది.  ఇటీవలే బెంగళూరులోని విస్ట్రన్‌ కార్ప్‌ ప్లాంట్‌లో  నాలుగు అంగుళాల యాపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈల తయారీ ప్రారంభమైంది.

ఐఓఎస్‌ 11, వైర్‌లెస్‌ హోమ్‌ స్పీకర్‌..
యాపిల్‌ తాజాగా మరికొన్ని కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెట్టింది. వార్షిక వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా మరిన్ని కొంగొత్త మల్టీటాస్కింగ్‌ ఫీచర్స్‌కు తోడ్పడేలా మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఐఓఎస్‌ 11 వెర్షన్‌ను ఆవిష్కరించింది. అలాగే వైర్‌లెస్‌ మ్యూజిక్‌ స్పీకర్‌ హోమ్‌పాడ్‌ను ప్రవేశపెట్టింది. గదికి అనుగుణంగా ఆడియోను ఆటోమేటిక్‌గా సవరించుకోగలగడం ఈ స్పీకర్‌ ప్రత్యేకత. యాపిల్‌ వాచ్‌ తర్వాత.. రెండేళ్ల విరామం అనంతరం యాపిల్‌ నుంచి వచ్చిన తొలి హార్డ్‌వేర్‌ ఉత్పత్తి ఇదే.

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి హోమ్‌పాడ్‌ అందుబాటులోకి వస్తుంది. త్వరలో తమ టీవీ స్ట్రీమింగ్‌ బాక్స్‌లో అమెజాన్‌కి చెందిన వీడియో యాప్‌ కూడా అందుబాటులోకి రానున్నట్లు సంస్థసీఈవో టిమ్‌ కుక్‌ తెలిపారు. అటు స్మార్ట్‌వాచ్‌కి సంబంధించి వాచ్‌ఓఎస్‌ 4 వెర్షన్‌ను సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. మరోవైపు మ్యాక్‌ఓఎస్‌ కొత్త వెర్షన్‌ను (హై సియెరా), సరికొత్త సఫారీ బ్రౌజర్‌ను కుక్‌ ఆవిష్కరించారు. టచ్‌బార్‌ లేకుండా 13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రోను 1,299 డాలర్లకు, ఆల్‌ ఇన్‌ వన్‌ డెస్క్‌టాప్‌ ఐమ్యాక్‌ ప్రోను 4,999 డాలర్లకు అందించనున్నట్లు ఆయన వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement