ఎలాంటి సవాళ్లకైనా రెడీ! | Sakshi
Sakshi News home page

ఎలాంటి సవాళ్లకైనా రెడీ!

Published Wed, Jun 29 2016 12:29 AM

ఎలాంటి సవాళ్లకైనా రెడీ!

దీటుగా ఎదుర్కొనే సత్తా భారత్ ఆర్థిక వ్యవస్థకు ఉంది..
ఆర్‌బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక
ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, ఎన్‌పీఏలపై భయం అక్కర్లేదని భరోసా

ముంబై: వర్థమాన దేశాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ చక్కటి పనితీరు ప్రదర్శిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్) పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, బ్యాంకింగ్ రంగ సమస్యలు ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థకు వీటిని తట్టుకుని నిలబడే సత్తా  ఉందనీ వివరించింది. ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం నివేదికను విడుదల చేశారు.  నివేదికలో రాజన్ తొలి వాక్యం రాస్తూ... రుణ వృద్ధి వేగానికి తొలుత బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కారం అవసరమని పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు...

వర్థమాన దేశాల్లో భారత్ వృద్ధి తీరు బాగుంది.  భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది.

కమోడిటీ ముఖ్యంగా చమురు ధరలు తక్కువగా ఉండటం సానుకూల అంశం. ఇందుకు సంబంధించి జీ-20 దేశాల్లో అత్యధిక వాణిజ్య ప్రయోజనాలను పొందిన దేశం భారత్ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనావేసింది.

ఆర్థిక వ్యవస్థ పటిష్ట  వృద్ధికి భారీగా పెట్టుబడులు పెరగడం, వినియోగ వృద్ధి అవసరం.

తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు (363.83 బిలియన్ డాలర్లు), తక్కువ స్థాయి వాణిజ్యలోటు అంతర్జాతీయంగా భారత్‌కు లాభదాయక అంశాలు.

రెవెన్యూ లోటును తగ్గించుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సబ్సిడీలు దుర్వినియోగం కాకుండా ఈ విభాగంలో హేతుబద్ధీకరణకూ కృషి కొనసాగుతోంది. అయితే పన్ను ఆదాయాలు మరింత పెరగాలి. ఇందుకు ట్యాక్స్ బేస్ మరింత విస్తృతం కావాల్సి ఉంది.

2016 మార్చిలో 7.6 శాతంగా ఉన్న ఎన్‌పీఏలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 8.5% నుంచి 9.3 శాతం శ్రేణిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. 2015లో ఎన్‌పీఏలు 5.1 శాతం.

2015-16 మధ్య కార్పొరేట్ల ఇబ్బందులు కాస్త తగ్గుముఖం పట్టాయి. రుణ ఒత్తిడిలో ఉన్న కంపెనీల రేటు మార్చి 2015లో 19 శాతంకాగా 2016 మార్చిలో ఈ రేటు 14 శాతానికి తగ్గింది.

జూన్ 7న రేటు నిర్ణయానికి మెజారిటీనే ప్రాతిపదిక!

జూన్ 7వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపోను యథాతథంగా 6.50 వద్దే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఏకాభిప్రాయం ప్రాతిపదికన తీసుకున్నారు. మంగళవారంనాడు ఇందుకు సంబంధించి మినిట్స్ అంశాలు వెల్లడయ్యాయి. ఐదుగురు సభ్యుల కమిటీలో ముగ్గురు రేటు కోతకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు, ముందు ద్రవ్యోల్బణం 5% స్థాయికి రావాలని, అటు తర్వాతే రేటు కోత సమంజసమని పేర్కొన్నారు. అప్పటికి మరో వారం రోజుల్లో వెలువడనున్న అమెరికా ఫెడ్ ఫండ్ రేటు నిర్ణయానికి వేచి చూడాలనీ వారు సూచించారు.  కాగా మరో ఇరువురు సభ్యులు మాత్రం పాలసీ రేటును పావుశాతం తగ్గించాలని సూచించారు.  మే 24-30 తేదీల మధ్య ఆన్‌లైన్ ద్వారా  టీఏసీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపారు. ప్రస్తుత విధానం ప్రకారం... వీరి అభిప్రాయాలతో పనిలేకుండా ఆర్‌బీఐ గవర్నర్ రెపో రేటు నిర్ణయం తీసుకునే వీలుంది.

ఎన్‌పీఏల సమస్య పరిష్కారం కీలకం: రాజన్
మొండిబకాయిల పరిష్కారం తక్షణం కీలకాంశమని నివేదిక తొలి వాక్యంలో రాజన్ పేర్కొన్నారు. పటిష్ట దేశీయ విధానాలు, సంస్కరణలు ఇందుకు అవసరమని అన్నారు. కార్పొరేట్ రంగంలో ఉన్న ఒత్తిడికి బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు ప్రతిబింబమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో వ్యాపార నిర్వహణకు ఉన్న పలు అడ్డంకుల పరిష్కారం దిశలో సంస్కరణలు మొండిబకాయిల సమస్య పరిష్కారానికీ దోహదపడతాయని వివరించారు. అంతర్జాతీయంగా ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే పరిస్థితి ఉన్నా... దేశీయంగా వ్యవస్థీకృత సంస్కరణల అమలూ వృద్ధి పటిష్టతకు కీలకమని వివరించారు. అలాగే ఆర్‌బీఐ విధాన రుణ రేటు ప్రయోజనం బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించే వెసులుబాటు కల్పించేలా చర్యలు అవసరమన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement