ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం 25 శాతం అప్‌ | Sakshi
Sakshi News home page

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం 25 శాతం అప్‌

Published Fri, Oct 13 2017 12:22 AM

IndusInd Bank's profit up 25%

ముంబై: హిందుజా గ్రూప్‌కు చెందిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌కు వాణిజ్య వాహన రుణాలు పెరగడం కలసివచ్చింది. దీంతో ఈ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.880 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం రూ.704 కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి నమోదైంది. వాణిజ్య వాహనాల రుణాలు 25 శాతం పెరగడంతో మొత్తం రుణాలు 18 శాతం వృద్ధి చెందాయని, దీంతో మంచి ఆర్థిక ఫలితాలు సాధించామని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌  ఎండీ రమేశ్‌ సోబ్తి చెప్పారు.

సేవింగ్స్‌ డిపాజిట్లు 95 శాతం పెరగడంతో వ్యయాలకు, ఆదాయానికి గల నిష్పత్తి తక్కువగా ఉండడం, రుణ నాణ్యత నిలకడగా ఉండడం, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం.. ఇవన్నీ నికర లాభం 25 శాతం పెరగడానికి ప్రధాన కారణాలని  వివరించారు.  కాసా డిపాజిట్లు దాదాపు రెట్టింపు కావడంతో మొత్తం డిపాజిట్లు 26 శాతం పెరిగాయని, దీంతో 4 శాతం నికర వడ్డీ మార్జిన్‌ (నిమ్‌) సాధించామని చెప్పారు. గత క్యూ2లో రూ.4,440 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.5,396 కోట్లకు పెరిగింది.

స్థూల మొండి బకాయిలు 0.90 శాతం నుంచి 1.08 శాతానికి, నికర మొండి బకాయిలు 0.37 శాతం నుంచి 0.44 శాతానికి  పెరిగాయని పేర్కొన్నారు. అంకెల పరంగా చూస్తే, నికర మొండి బకాయిలు రూ.508 కోట్ల నుంచి రూ.537 కోట్లకు, స్థూల మొండి బకాయిలు రూ.1,272 కోట్ల నుంచి రూ.1,345 కోట్లకు పెరిగాయని వివరించారు. ఇక కేటాయింపులు కూడా రూ.214 కోట్ల నుంచి రూ.294 కోట్లకు పెరిగాయని వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఇండస్‌ఇండ్‌  షేర్‌ బీఎస్‌ఈలో 1.4 శాతం లాభంతో రూ.1,743 వద్ద ముగిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement