ఎల్‌వోయూలపై నిషేధంతో  చిన్న సంస్థలకు దెబ్బ | Sakshi
Sakshi News home page

ఎల్‌వోయూలపై నిషేధంతో  చిన్న సంస్థలకు దెబ్బ

Published Thu, Mar 15 2018 12:38 AM

Industry concerns concern - Sakshi

న్యూఢిల్లీ: లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌వోయూ)ని రిజర్వ్‌ బ్యాంక్‌ నిషేధించడం.. వ్యాపారాలపై తక్షణ ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపార సంస్థలు.. మరింతగా నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ. 13,000 కోట్ల కుంభకోణం దరిమిలా దిగుమతిదారులు రుణ సదుపాయం పొందేందుకు ఉపయోగపడే ఎల్‌వోయూలను ఇకపై జారీ చేయొద్దంటూ బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించిన నేపథ్యంలో పరిశ్రమ వర్గాల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్‌బీఐ నిర్ణయం దిగుమతి సంస్థల కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తుందని, చాన్నాళ్లుగా ఎల్‌వోయూల ఆధారంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ట్రేడర్లు తాజా పరిణామంతో తప్పనిసరిగా లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్, బ్యాంక్‌ గ్యారంటీ వంటి సాధనాల వైపు మళ్లాల్సి వస్తుందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్‌ శోభన కామినేని పేర్కొన్నారు. మరోవైపు, కుంభకోణాల్లాంటి వాటిని అరికట్టేందుకు ఈ సాధనాలను నిషేధించడం పరిష్కార మార్గం కాదని పీహెచ్‌డీ చాంబర్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ ఖేతాన్‌ వ్యాఖ్యానించారు. లావాదేవీలకు అనుగుణంగా మూలధనాన్ని నిర్వహించుకునే చిన్న తరహా సంస్థలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. తాజా పరిణామంతో అవి మరింత అధిక నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని లేకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఖేతాన్‌ వివరించారు.  

విధానకర్తలు జాగ్రత్తగా వ్యవహరించాలి: సన్యాల్‌ 
న్యూఢిల్లీ: నీరవ్‌ మోదీ స్కామ్‌ నేపథ్యంలో బ్యాంకులు ఎల్‌వోయూలు జారీ చేయకుండా ఆర్‌బీఐ నిషేధం విధించిన నేపథ్యంలో ఈ తరహా చర్యల విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలని ప్రధానమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ విధాన కర్తలకు సూచించారు. ఒక మార్గాన్ని మూసివేసే చర్య మిగిలిన వ్యవస్థకు పాకకుండా చూడాలని, ఎందుకంటే సిలో వ్యవస్థ (ఇతర వ్యవస్థలతో అనుసంధానం కాని)తో వ్యవహరించడం లేదని గుర్తు చేశారు. 

Advertisement
Advertisement