Sakshi News home page

ఇన్ఫోసిస్‌లో వెయ్యి ఉద్యోగాలు

Published Thu, Mar 15 2018 1:03 PM

Infosys To Open Tech Hub In US Hire 1000 Americans - Sakshi

న్యూఢిల్లీ : దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ త్వరలోనే ఓ టెక్‌ హబ్‌ను ప్రారంభించబోతుంది. అమెరికాలోని హార్ట్‌ఫోర్డ్‌ కనెక్టికట్‌లో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ హబ్‌ను ప్రారంభించబోతున్నట్టు గురువారం ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఈ టెక్‌ హబ్‌ ఏర్పాటుతో 2022 నాటికి వెయ్యి మంది అమెరికన్‌ టెక్‌ వర్కర్లను నియమించుకోనున్నట్టు పేర్కొంది. గతేడాదే ఇన్ఫోసిస్‌ ఈ టెక్‌ హబ్‌పై ప్రకటన చేసింది. అమెరికాలో పలు టెక్‌ హబ్‌లను ఏర్పాటుచేసి, వచ్చే రెండేళ్లలో 10వేల మంది స్థానికులను నియమించుకోనున్నట్టు ఇన్ఫోసిస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తన తొలి టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ హబ్‌ను ఇండియానాలో ప్రారంభించింది. నార్త్‌ కారోలినాలో మరో హబ్‌ను, రోడ్‌ ఐల్యాండ్లో కూడా డిజైన్‌, ఇన్నోవేషన్‌ హబ్‌ను కూడా ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ప్రస్తుతం కనెక్టికట్‌లో ఏర్పాటుచేయబోతుందన్నది రెండో టెక్నాలజీ హబ్‌. 

అమెరికా వర్కర్ల నుంచి ఉద్యోగాలను అక్రమంగా తన్నుకుపోతున్నాయంటూ అవుట్‌సోర్సింగ్‌ సంస్థలపై డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవుట్‌సోర్సింగ్‌ సంస్థలపై నిబంధనలను కూడా ట్రంప్‌ కఠినతరం చేస్తున్నారు. దీంతో అవుట్‌సోర్సింగ్‌ సంస్థలన్నీ స్థానిక నియామకాలపై దృష్టిసారించాయి. కనెక్టికట్‌లో ఏర్పాటుచేయబోయే హబ్‌లో ఇన్సూరెన్స్‌, హెల్త్‌కేర్‌, మానుఫ్రాక్ట్ర్చరింగ్‌లపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్టు ఇన్ఫోసిస్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కనెక్టికట్‌లో తమ ఉనికి విస్తరిస్తున్నట్టు ప్రకటించడం ఆనందదాయకంగా ఉందని, రాష్ట్రంలో దాదాపు వెయ్యి టెక్నాలజీ ఉద్యోగాలను కల్పించనున్నామని ఇన్ఫోసిస్‌ ప్రెసిడెంట్‌ రవి కుమార్‌ తెలిపారు. న్యూ ఇంగ్లాండ్‌ ప్రాంతం వారీగా క్లయింట్లకు తమ సేవలందించడానికి తమ పెట్టుబడులను మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. స్థానిక వర్క్‌ఫోర్స్‌ను కూడా విస్తరించాలన్నారు. 
 

Advertisement
Advertisement