తొలిసారి టాప్‌ ఐటీ కంపెనీల్లో తగ్గిన ఉద్యోగులు | Sakshi
Sakshi News home page

తొలిసారి టాప్‌ ఐటీ కంపెనీల్లో తగ్గిన ఉద్యోగులు

Published Tue, Aug 1 2017 10:35 AM

తొలిసారి టాప్‌ ఐటీ కంపెనీల్లో తగ్గిన ఉద్యోగులు

బెంగళూరు : 154 బిలియన్‌ డాలర్ల దేశీయ ఐటీ రంగం అప్పట్లో ఉద్యోగాలకు పుట్టినిల్లు. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారైన సంగతి తెలిసిందే. ఉద్యోగాలను కల్పించడంలోనూ ఈ రంగం  తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మొట్టమొదటిసారి టాప్‌-5 ఐటీ కంపెనీలోని మూడు కంపెనీల్లో ఉద్యోగులు భారీగా తగ్గిపోయారు. జూన్‌30తో ముగిసిన క్వార్టర్‌లో ఈ విషయం వెల్లడైంది. టాప్‌-5 ఐటీ కంపెనీల్లో జూన్‌ క్వార్టర్‌ ముగిసేసరికి 984,913 మంది ఉద్యోగులున్నారు. అంటే వారి వర్క్‌ఫోర్స్‌ గత క్వార్టర్‌ మార్చితో పోలిస్తే 1,821 మంది తగ్గిపోయింది. కాగ, 2017 మార్చితో ముగిసిన క్వార్టర్‌లో దేశీయ ఐటీ పరిశ్రమ 39 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్‌ వెల్లడించింది. అంతేకాక కనీసం 150,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు నాస్కామ్‌ అంచనావేసింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే నాస్కామ్‌ అంచనాలు తప్పేలా కనిపిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సర్వీసులు సంస్థగా పేరున్న టీసీఎస్‌ వర్క్‌ఫోర్స్‌ జూన్‌తో ముగిసిన క్వార్టర్‌తో 1,414 మంది తగ్గి, 385,809గా ఉంది. అదేవిధంగా ఇన్ఫోసిస్‌ ఉద్యోగాలు నికరంగా 1,811 పడిపోయాయి. టెక్‌ మహింద్రాలో కూడా 1,713 మంది వర్క్‌ఫోర్స్‌ తగ్గిపోయారు. 
 
కేవలం విప్రో, హెచ్‌సీఎల్‌లు మాత్రమే తమ వర్క్‌ఫోర్స్‌లో నికర అడిక్షన్‌ను నమోదుచేశాయి. విప్రోలో ఇన్ఫోసర్వర్‌ కొనుగోలుతో కొత్తగా 200 మంది ఉద్యోగుల జాయిన్‌ అయ్యారు. అదనంగా మరో 1000 మంది ఉద్యోగులను తమ క్లయింట్‌ వర్క్‌ఫోర్స్‌ నుంచి తీసుకుంది. మిగతా ఐటీ కంపెనీలు ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లిమిటెడ్‌, మైండ్‌ట్రి లిమిటెడ్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, హెక్సావేర్‌ లిమిటెడ్‌, సింట్‌ లిమిటెడ్‌లు ఈ క్వార్టర్‌లో 2,026 మంది ఉద్యోగులను కంపెనీల్లోకి తీసుకున్నాయి. కంపెనీ బిజినెస్‌ మోడల్‌లు మారడంతో ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడంలో తీవ్ర కఠినతరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిసింది. ఓ వైపు ట్రంప్‌ రక్షణాత్మక విధానాలు, మరోవైపు ఆటోమేషన్‌ ప్రభావంతో చాలా కంపెనీలు తమ ప్రస్తుత వర్క్‌ఫోర్స్‌ విషయంలో పునఃసమీక్షించుకోవడం మొదలుపెట్టాయి. ఈ ప్రభావంతో భారీగా వర్క్‌ఫోర్స్‌ను కంపెనీలు తగ్గిస్తున్నట్టు వెల్లడైంది. ఈ ఏడాది టాప్‌-7 ఐటీ కంపెనీలు 56వేల మంది ఇంజనీర్లను కంపెనీలు విడిచిపెట్టి వెళ్లమని ఆదేశించవచ్చని మింట్‌ గతంలోనే రిపోర్టు చేసింది. ఈ సంఖ్య గతేడాది నుంచి రెండింతలు పెరుగుతుందని తెలిపింది. 

Advertisement
Advertisement