పెట్టుబడికి.. రక్షణకు బీమా పాలసీలు | Sakshi
Sakshi News home page

పెట్టుబడికి.. రక్షణకు బీమా పాలసీలు

Published Sun, Sep 21 2014 12:56 AM

పెట్టుబడికి.. రక్షణకు బీమా పాలసీలు

 కుటుంబానికి ఏ లోటూ రానీకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమిస్తాం. కష్టపడి ఒక్కో రూపాయి పోగేసి ఎంతో కొంత సంపద వారికి ఇవ్వాలనుకుంటాం. ఈ క్రమంలో ఉపయోగపడేదే జీవిత బీమా పాలసీ. పొదుపు, పెట్టుబడులకే కాకుండా తర్వాత తరం వారికి సంపదను అందజేసే సాధనంగా కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. లక్ష్యాలను బట్టి ఎంచుకునేందుకు అందుబాటులో ఉన్న వివిధ రకాల పాలసీలను గురించి వివరించేదే ఈ కథనం.
 సాధారణంగా వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను బట్టి జీవిత బీమా పాలసీలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి పూర్తిగా బీమా రక్షణ కల్పించేది, రెండోది పెట్టుబడి ప్రయోజనాలు కల్పించేది, మూడోది ఇటు పెట్టుబడులు అటు బీమా భద్రత ప్రయోజనాలు కల్పించేదిగా పాలసీలు ఉన్నాయి. ప్యూర్ ప్రొటెక్షన్, ఇన్వెస్ట్‌మెంట్ కమ్ ప్రొటెక్షన్ కోణంలో ఉన్న పాలసీల గురించి ఇందులో తెలుసుకుందాం.

 టర్మ్ పథకాలు..
 పాలసీదారు మరణం వల్ల తలెత్తే ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేందుకు ఉపయోగపడేవి ప్యూర్ ప్రొటెక్షన్ (కేవలం రక్షణకు మాత్రమే ఉపయోగపడే ) పథకాలు. టర్మ్ ప్లాన్లకు పాలసీదారు ఏటా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. పాలసీదారు మరణానంతరం సమ్ అష్యూర్డ్‌ను నామినీకి బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఏటా ప్రీమియంలు కడుతున్నప్పటికీ.. ఒకవేళ పాలసీ వ్యవధి దాటిన తర్వాత కూడా పాలసీదారు జీవించి ఉన్న పక్షంలో చేతికేమీ రాదు. ఎందుకంటే, ఈ పాలసీలు కేవలం రక్షణకు మాత్రమే ఉద్దేశించినవే తప్ప.. పెట్టుబడి కోణం వీటిలో ఉండదు. అందుకే, ఇతర పాలసీలతో పోలిస్తే చాలా తక్కువ ప్రీమియంలో అధిక కవరేజీ ఇచ్చేలా ఈ పాలసీలు ఉంటాయి. అయితే ప్రీమియం తిరిగిచ్చే విధమైన టర్మ్ ఇన్సూరెన్స్ పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే, ప్యూర్ టర్మ్ ప్లాన్లతో పోలిస్తే వీటి ప్రీమియాలు అధికంగా ఉంటాయి.

 ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్‌మెంట్ పథకాలు..
 ఇవి ఒకవైపు బీమా రక్షణ కల్పిస్తూనే మరోవైపు పెట్టుబడి సాధనాలుగా కూడా ఉపయోగపడతాయి. కట్టిన ప్రీమియంపై ఎంతో కొంత రాబడిని కూడా ఇచ్చే టర్మ్ ప్లాన్లను .. ఎండోమెంటు పథకాలుగా వ్యవహరిస్తారు. పాలసీ వ్యవధిలోగా పాలసీదారు మరణించినా లేక వ్యవధి తీరిపోయిన తర్వాత కూడా జీవించే ఉన్నా  కూడా.. ఇటు సమ్ అష్యూర్డ్‌తో పాటు అటు కొంత మేర రాబడులు కూడా ఈ పథకాలు అందిస్తాయి. అందుకే, ప్యూర్ ప్రొటెక్షన్ పథకాలతో పోలిస్తే వీటి ప్రీమియాలు కాస్త ఎక్కువగా ఉంటాయి.

 ఈ పథకాలకు కట్టిన ప్రీమియాలను కొంత మొత్తం జీవిత బీమా కోసం, మిగతాదాన్ని రాబడుల గురించి పెట్టుబడుల కోసం, అలాగే అడ్మినిస్ట్రేటివ్ వ్యయాల వసూలు కోసం బీమా కంపెనీ కేటాయిస్తుంటుంది. దీంతో ఎండోమెంట్ ప్లాన్లపై రాబడులు సగటున 5-8% మేర ఉంటాయి. జీవిత బీమా కంపెనీకి వచ్చే లాభాల్లో ఎండోమెంటు పాలసీదారులకు ఎంతో కొంత వాటా గ్యారంటీ రాబడిగా లభిస్తుంది. ఒకవేళ అలాంటి గ్యారంటీ లేని పక్షంలో పాలసీదారులకు కంపెనీ బోనస్‌లు ఇస్తుంది.

 మనీ బ్యాక్ పథకాలు..
 పాలసీ కాలంలో ఒక్కో దశలో కొంత కొంత చొప్పున సమ్ అష్యూర్డ్‌ను అందజేసే ఎండోమెంటు తరహా పథకాలు.. ఈ మనీ బ్యాక్ ప్లాన్స్. ఒకవేళ పాలసీ వ్యవధిలోగా పాలసీదారు మరణించిన పక్షంలో .. అప్పటిదాకా ఎంత ఇచ్చినా కూడా కంపెనీ పూర్తి సమ్ అష్యూర్డ్‌ను తిరిగి చెల్లిస్తుంది. బోనస్‌లు కూడా పూర్తి సమ్ అష్యూర్డ్ మీదే లెక్కిస్తుంది. దీంతో సాధారణ ఎండోమెంటు పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియాలు మరికాస్త ఎక్కువగా ఉంటాయి.

 ప్యూర్ టర్మ్ ప్లాన్లు, ఎండోమెంటు ప్లాన్లు, మనీ బ్యాక్ పథకాలు సాధారణంగా నిర్దిష్ట వయస్సు దాకా మాత్రమే బీమా కవరేజి ఇస్తాయి. ఒకవేళ ఆ తర్వాత కాలానికి కూడా కవరేజి కావాలంటే.. హోల్ లైఫ్ పథకాలను ఎంచుకోవచ్చు. వీటి విషయంలో నిర్దిష్ట వయస్సు దాకా లేదా నిర్దిష్ట కాలం దాకా ప్రీమియాలు కట్టాలి. మెచ్యూరిటీ వయస్సు వచ్చిన తర్వాత తదుపరి ఎలాంటి ప్రీమియంలు కట్టకుండా కవరేజీని జీవితాంతం కొనసాగించుకోవచ్చు లేదా..సమ్ అష్యూర్డ్, బోనస్‌లను తీసుకోవచ్చు.

 మనం చెల్లించే ప్రీమియంలను ఏయే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలని జీవిత బీమా సంస్థలకి చెప్పేందుకు ఈ తరహా పథకాల్లో సాధ్యపడదు. ఇలాంటి పథకాలకొచ్చే ప్రీమియంలను బీమా కంపెనీలు సర్వసాధారణంగా అసలు మొత్తం సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువగా డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అయితే, మనం చెల్లించే ప్రీమియంలను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న విషయంలో మనదే పైచేయి ఉండాలంటే యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు (యులిప్స్)ను ఎంచుకోవచ్చు.

యులిప్స్ ప్రీమియంలను డెట్, ఈక్విటీ  తదితర సాధనాల్లో బీమా సంస్థలు ఇన్వెస్ట్ చేస్తాయి. మన రిస్కు సామర్ధ్యాన్ని బట్టి కావాల్సినది ఎంచుకోవచ్చు. అయితే, యూలిప్స్‌లో వివిధ రకాల చార్జీలు ఉంటాయి. మార్కెట్లపై కాస్త అవగాహన ఉన్నవారికి ఇవి అనువైనవి.  చివరిగా చెప్పొచ్చేదేమిటంటే.. ఒక ఇన్వెస్టరుగా మీ అవసరాలు, రిస్కు సామర్ధ్యానికి అనుగుణమైన పాలసీలను పరిశీలించండి. స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత సదరు పాలసీని తీసుకోండి.

Advertisement
Advertisement