మనం చౌక వడ్డీరేట్ల జమానాలోకి వెళ్లాల్సిందే.. | Sakshi
Sakshi News home page

మనం చౌక వడ్డీరేట్ల జమానాలోకి వెళ్లాల్సిందే..

Published Mon, Mar 21 2016 12:48 AM

మనం చౌక వడ్డీరేట్ల జమానాలోకి వెళ్లాల్సిందే..

పొదుపు పథకాల రేట్ల తగ్గింపుపై
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్య


న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించి వడ్డీరేట్లను భారీగా తగ్గించడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ఈ చర్యలను సమర్థించుకున్నారు. ఆర్థిక వ్యవస్థను మరింతగా పుంజుకునేలా చేయాలంటే భారత్ చౌక వడ్డీరేట్ల జమానాలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారమిక్కడ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌తో పాటు ఇతర పథకాలకు వడ్డీరేట్ల కోత విధించడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు.

‘పొదుపు పథకాలపై వడ్డీరేట్ల ఖరారుకు ఒక విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. వడ్డీరేట్లను మార్కెట్ నిర్ధేశిస్తుంది. వీటితో పోలిస్తే పొదుపు స్కీమ్‌లకు అధిక వడ్డీనిచ్చేందుకు ప్రభుత్వం తన నిధులను ఉపయోగిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో కూడా ఇదే విధమైన ఫార్ములాను అమలు చేశారు. ఇది మా ప్రభుత్వం ఖరారు చేసిందేమీకాదు. అయితే, అప్పుడు ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటంతో ఈ వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇవి క్రమంగా దిగొస్తున్నాయంతే. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను పరిశీలిస్తే.. ఒకపక్క రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. ఇదే క్రమంలో డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు అధికంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కాకుండా వృద్ధి బాటన పయనించాలంటే రుణ, డిపాజిట్ రేట్లు రెండూ తగ్గాల్సిందే’ అని జైట్లీ పేర్కొన్నారు. పీపీఎఫ్‌పై 8.1 శాతం(తగ్గించిన తర్వాత) వడ్డీరేటు అనేది మంచి రాబడి కిందే లెక్కఅని కూడా ఆర్థిక మంత్రి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి స్కీమ్‌కు అధిక వడ్డీరేట్లు లేవన్నారు. ఈ పథకానికి పన్ను మినహాయింపు ఉన్న నేపథ్యంలో వాస్తవ రాబడి 11.12 శాతంమేర ఉంటుందన్నారు.

 జీఎస్‌టీ బిల్లుకు త్వరలో మోక్షం!
రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ); దివాళా కోడ్ బిల్లులకు ఆమోదం లభించగలదన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. వీటికి సంబంధించి నెలకొన్న విభేధాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని... ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను ఒప్పించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు తన ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారని కూడా ఆర్థిక మంత్రి చెప్పారు.  మరోపక్క, జువెలరీ వర్తకులపై విధించిన 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని కూడా జైట్లీ సమర్థించుకున్నారు. జీఎస్‌టీ వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో విలాసవంత ఉత్పత్తులన్నింటినీ పన్నుల పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పన్ను అధికారులు తమను వేధిస్తారని జువెలర్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలపై మాట్లాడుతూ.. అలాంటివి జరగడానికి వీల్లేదని జైట్లీ వ్యాఖ్యానించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement