బెయిల్ @ రూ.10 వేల కోట్లు | Sakshi
Sakshi News home page

బెయిల్ @ రూ.10 వేల కోట్లు

Published Thu, Mar 27 2014 1:05 AM

బెయిల్ @ రూ.10 వేల కోట్లు

 న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్, ఇరువురు డెరైక్టర్లకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటే రూ.10,000 కోట్లు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు సహారా గ్రూప్‌ను ఆదేశించింది. కోర్టు తాజా షరతులను కంపెనీ పాటిస్తేనే- తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేయడం జరుగుతుందని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. గ్రూప్ సంస్థలు రెండు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి రూ.25,000 కోట్ల సమీకరణ, సంబంధిత డబ్బు తిరిగి చెల్లింపులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశం, ఈ ప్రక్రియలో సహారా వైఫల్యం, సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ల విచారణ వ్యవహారంలో మార్చి 4వ తేదీ నుంచీ రాయ్, ఇరువురు డెరైక్టర్లు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 విధానమిది...
 చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో రూ.5,000 కోట్లను సుప్రీంకోర్టు వద్ద డిపాజిట్ చేయాలని, మిగిలిన రూ.5,000 కోట్లను ఒక జాతీయ బ్యాంక్ గ్యారంటీ ద్వారా (సెబీ పేరుతో) సమర్పించాలని కోర్టు నిర్దేశించింది. సెబీ వద్ద డిపాజిట్ చేయడానికి సంబంధించి మొత్తం నిధుల సమీకరణకు  వెసులుబాటు కల్పించే ప్రక్రియలో భాగమే తాత్కాలిక బెయిల్ మంజూరన్న విషయాన్ని గ్రూప్ గమనంలో ఉంచుకోవాలని కోర్టు పేర్కొంది. సహారా గ్రూప్ వడ్డీతో సహా రూ. 34,000 కోట్లు చెల్లించాలని సెబీ వాదిస్తోంది.  రాయ్ జైలులో ఉండగా ఈ మొత్తాలనుసైతం సమీకరించడం కష్టమని సహారా గ్రూప్ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం అంతక్రితం అంగీకరించలేదు.

 రూ.2,500 కోట్లను సెబీ వద్ద డిపాజిట్ చేసి, రూ. 10,000 కోట్లలో మిగిలిన మొత్తాన్ని సమర్పించడానికి నెలరోజుల సమయం ఇవ్వాలని, ఈ ప్రతిపాదనపై రాయ్‌ని జైలు నుంచి విడుదల చేయాలని సహారా న్యాయవాది చేసిన వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.  తమ తాజా రూలింగ్‌పై స్పందనను తెలియజేయాలని సుప్రీం సహారాను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను నేటికి (గురువారానికి) వాయిదా వేసింది. కాగా బెయిల్‌కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో డబ్బును చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ఒక సంచలనమేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 బ్యాంక్ అకౌంట్ల డీఫ్రీజ్‌కూ ఓకే...
 కోర్టు తాజా నిర్దేశాల ప్రకారం నిధుల సమీకరణకు వీలుగా ‘ఫ్రీజ్’(స్తంభింప) చేసిన సంస్థ బ్యాంక్ అకౌంట్లను ‘డీఫ్రీజ్’ చేసేందుకు సైతం కోర్టు అంగీకరించింది. డీఫ్రీజ్ చేయాల్సిఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్ల వివరాలను గురువారం అందజేయాలని  ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సహారాకు సూచించింది. తదుపరి ఇందుకు తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొంది.

 ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో సహారా గ్రూప్ షేర్లు డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో సహారా వన్ మీడియా 5% పతనమై రూ. 60 వద్ద ముగియగా, సహారా హౌసింగ్ ఫైనాన్స్ 10%  దిగజారి రూ. 42.50 వద్ద నిలిచింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement