నీరవ్‌ మోదీకి షాక్‌, ఏ క్షణంలోనైనా అరెస్ట్‌!

2 Jul, 2018 11:05 IST|Sakshi

న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీకి ఇంటర్‌పోల్‌ షాకిచ్చింది. భారత అభ్యర్థన మేరకు నీరవ్‌ మోదీకి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్‌ రెడ్‌-కార్నర్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల జారీతో విదేశాల్లో నక్కిన నీరవ్‌ మోదీని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ఇంటర్‌పోల్‌కు చెందిన 192 దేశాల పోలీసులు ఎవరైనా ఇతన్ని అరెస్ట్‌ చేయవచ్చు. ఒక్కసారి నీరవ్‌ మోదీ అరెస్ట్‌ అయితే, అతన్ని తమకు అప్పగించమని భారత్‌ కోరవచ్చు. ఈ ప్రక్రియ విజయవంతమవడానికి భారత్‌ ఆ దేశాలతో ఉన్న ఒప్పందాలు, సంబంధాలు సహకరిస్తాయి. నీరవ్‌ మోదీతో పాటు మోదీ సోదరుడు నిశాల్‌, సుభాష్‌ పరబ్‌లకు వ్యతిరేకంగా కూడా రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీఅయ్యాయి. నీరవ్‌ మోదీకి వ్యతిరేకంగా జారీ చేసిన రెడ్‌కార్నర్‌ నోటీసులను ఏజెన్సీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. 

నీరవ్‌ మోదీకి వ్యతిరేకంగా జారీచేసిన నోటీసులను ప్రజల ముందుకు తీసుకురావాలని సీబీఐ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ ఈ నోటీసులను తన వెబ్‌సైట్‌లో పొందుపరించింది.  నీరవ్‌కు వ్యతిరేకంగా జారీ అయిన నోటీసుల్లో అతని ఫోటోగ్రాఫ్‌, వ్యక్తిగత వివరాలు, పుట్టిన తేదీ, అతనికి వ్యతిరేకంగా మనీ లాండరింగ్‌ ఛార్జస్‌ నమోదైనట్టు  ఉన్నాయి. నీరవ్‌ మోదీ, అతని సన్నిహితులు కలిసి పీఎన్‌బీలో దాదాపు రూ.13 వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలా స్కాం చేసి దక్కించుకున్న నగదును, మనీ లాండరింగ్‌ ద్వారా విదేశాలకు తరలించాడు. పీఎన్‌బీ ఈ కేసును వెలుగులోకి బట్టబయలు చేస్తుందనే క్రమంలో మోదీ, అతని సన్నిహితులు జనవరిలో దేశం విడిచి పారిపోయారు. ఇప్పటి వరకు నీరవ్‌ ఎక్కడ ఉన్నాడన్నది ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. ఈ కేసుపై విచారణ చేపట్టిన దర్యాప్తు ఏజెన్సీలు సీబీఐ, ఈడీలు ఈ-మెయిల్‌ ద్వారా కాంటాక్ట్‌ అయినప్పటికీ, అతని నుంచి సరియైన స్పందన రాలేదు. భారత్‌కు వచ్చేది లేదంటూ చెప్పుకొచ్చాడు. తానేమీ తప్పు చేయలేదని వాదిస్తున్నాడు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా