యూఎస్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌  చేస్తారా? | Sakshi
Sakshi News home page

యూఎస్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌  చేస్తారా?

Published Wed, Jul 8 2020 2:46 PM

Invest in US FAAMNG Stocks  - Sakshi

గత కొద్ది నెలలుగా అమెరికా స్టాక్‌ ఇండెక్సులు సరికొత్త రికార్డులను సాధిస్తున్నాయి. ప్రధానంగా ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ జోరు చూపుతున్నాయి. నాస్‌డాక్‌ అయితే ఈ ఏడాది(2020)లో ఇప్పటివరకూ 20 సార్లకుపైగా చరిత్రాత్మక గరిష్టాలను తాకింది. కోవిడ్‌-19 సవాళ్లలోనూ అమెరికన్‌ మార్కెట్లు బుల్‌ ట్రెండ్‌లో కదులుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు ఇన్వెస్టర్ల ఫేవరెట్‌ స్టాక్స్‌ FAANG కారణమని తెలియజేశారు.  FAANG అంటే ఫేస్‌బుక్‌, అమెజాన్‌, యాపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌, అల్ఫాబెట్‌(గూగుల్‌(G) మాతృ సంస్థ). ఈ కంపెనీల తొలి అక్షరాలతో కలిపి ఫాంగ్‌ స్టాక్స్‌గా పిలిచే సంగతి తెలిసిందే. ఇక ఇటీవల వీటికి M అంటే టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ జత కలిసింది. అంతేకాకుండా ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్‌, వీడియో యాప్‌ జూమ్‌ సైతం ఈ జాబితాలో చేరడంతో మార్కెట్లు రికార్డుల దౌడు తీస్తున్నట్లు వివరించారు. వెరసి ఇటీవల దేశీ ఇన్వెస్టర్లు FAAMNG స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఆసక్తి చూపుతున్నట్లు మార్నింగ్‌స్టార్‌ ఇండియా తెలియజేసింది.

రూ. 6000 కోట్లు
యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లలో దేశీ ఇన్వెస్టర్లు రూ. 6,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసినట్లు మార్నింగ్‌స్టార్‌ ఇండియా వెల్లడించింది. అయితే ఈ పెట్టుబడుల్లో FAAMNG స్టాక్స్‌దే హవా అని తెలియజేసింది. దేశీ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో మార్కెట్లకు జోష్‌నిస్తున్న ఫేస్‌బుక్‌, అమెజాన్‌, యాపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌, గూగుల్‌కుతోడు మైక్రోసాఫ్ట్‌, టెస్లా ఇంక్‌, జూమ్‌ చోటు చేసుకుంటున్నట్లు పేర్కొంది. కొంతకాలంగా టెక్నాలజీ రంగానికి పెట్టుబడులు భారీగా మళ్లుతున్నాయని, అయితే దేశీయంగా ఇందుకు అవకాశాలు తక్కువేనని వెస్టెడ్‌ ఫైనాన్స్‌ సీఈవో విరామ్‌ షా వివరించారు. ఇటీవల యూఎస్‌లో ఇన్వెస్ట్‌చేసే వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు ఫేస్‌బుక్‌, స్టార్‌బక్స్‌ వంటి గ్లోబల్‌ బ్రాండ్లు వారికి సుపరిచితంకావడం కారణమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే విద్య, ప్రయాణాలు తదితర అంశాలకు పలువురు భారతీయులు యూఎస్‌పై భారీగా సొమ్ము వెచ్చిస్తున్నట్లు అలంకిత్‌ లిమిటెడ్‌ ఎండీ అంకిత్‌ అగర్వాల్ వివరించారు. గత 10 నెలల్లోనే 10,000 మంది కస్టమర్లు ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రారంభించినట్లు తెలియజేశారు. వీటి విలువ 3 కోట్ల డాలర్లు(రూ. 225 కోట్లు)గా వెల్లడించారు.

పెట్టుబడులిలా..
అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లలో దేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపట్టాలంటే రెండు మార్గాలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వీటిలో ఒకటి అతిసులువైన మ్యూచువల్‌ ఫండ్స్‌ రూట్‌. విదేశాలలో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ను ఎంచుకోవడం. మరొకటి స్వేచ్చా రెమిటెన్స్‌ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం. అయితే పెట్టుబడులకు మ్యూచువల్‌ ఫండ్ లేదా ఈటీఎఫ్‌ ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు.  

Advertisement
Advertisement