ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో వారికి బెయిల్‌ 

19 Feb, 2020 16:31 IST|Sakshi
నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ సింధు శ్రీ

సాక్షి,  న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న మొత్తం ఆరుగురు అధికారులకు బుధవారం  బెయిల్‌ మంజూరు చేసింది.  ప్రస్తుతం మద్యంతర బెయిల్‌పై ఉన్నవీరికి రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  వీరిలో నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ సింధు శ్రీ, మాజీ ఓఎస్‌డి ప్రదీప్ కుమార్ బగ్గా, ఎఫ్‌ఐపీబీ మాజీ డైరెక్టర్ ప్రబోధ్ సక్సేనాకు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే  ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎఫ్‌పీబీ యూనిట్ మాజీ సెక్షన్ ఆఫీసర్ అజీత్ కుమార్ డండుంగ్,  అప్పటి అండర్ సెక్రటరీ రవీంద్ర ప్రసాద్, మాజీ జాయింట్ సెక్రటరీ (ఫారిన్ ట్రేడ్) డిఇఓ అనుప్ కె పూజారీలకు కూడా కోర్టు ఉపశమనం ఇచ్చింది. బెయిల్ మంజూరు చేసింది.  ఒక్కొక్కరికి రూ .2 లక్షల  పూచీకత్తుపై  బెయిల్ మంజూరు చేసిన కోర్టు, తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. అలాగే సాక్ష్యాలను దెబ్బతీయవద్దని కూడా స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహార్ ఆదేశాలు జారీ చేశారు. 

కాగా చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూపునకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) క్లియరెన్స్‌లో అవకతవకలు జరిగాయని రూ .305 కోట్ల విదేశీ నిధులను ముట్టాయని ఆరోపిస్తూ  2017 మే 15 న  సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత మనీలాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. ఈ కేసులో మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారు. ఈకేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా నిందితుడుగా ఉన్నారు.

మరిన్ని వార్తలు