భారత్‌లో 'ఐఫోన్‌' X 89,000 | Sakshi
Sakshi News home page

భారత్‌లో 'ఐఫోన్‌' X 89,000

Published Thu, Sep 14 2017 1:03 AM

భారత్‌లో 'ఐఫోన్‌' X 89,000

♦  256 జీబీ వెర్షన్‌ రేటు రూ.1,02,000
♦  నవంబర్‌ 3 నుంచి అందుబాటులోకి
♦  ఐఫోన్‌ 8, 8ప్లస్‌ ధరలు రూ.64,000 నుంచి ప్రారంభం
♦  ఐఫోన్‌ 6, 7 వేరియంట్ల రేట్లు తగ్గింపు  


న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్‌ తాజాగా ఆవిష్కరించిన ఐఫోన్‌ కొత్త వెర్షన్లు... అమెరికా, ఇతర మార్కెట్లలో అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే భారత్‌లో కూడా లభించనున్నాయి. 64 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభించే ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ ధరలు భారత్‌లో రూ. 64,000 నుంచి ప్రారంభమవుతాయి. ఇవి దేశీయంగా సెప్టెంబర్‌ 29 నుంచి తమ ఆథరైజ్డ్‌ రీసెల్లర్స్‌ దగ్గర ఇవి అందుబాటులో ఉంటాయని యాపిల్‌ ఇండియా తెలియజేసింది. ఇక, తొలి ఐఫోన్‌ ప్రవేశపెట్టి పదేళ్లయిన సందర్భంగా కొత్తగా ఆవిష్కరించిన ఐఫోన్‌గీ (రోమన్‌ అంకెల్లో 10) నవంబర్‌ 3 నుంచి భారత్‌లో లభిస్తుంది. 64 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభించే ఈ ఫోన్‌ ధర రూ.89,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇక 256 జీబీ వేరియంట్‌ రేటు రూ.1,02,000గా ఉంటుంది. ఐఫోన్‌ గీలో ఫేస్‌ రికగ్నిషన్, సూపర్‌ రెటీనా డిస్‌ప్లే తదితర ఫీచర్స్‌ ఉంటాయి.

ఈ ఫోన్‌ రాకతో యాపిల్‌ కొత్తగా ప్రీమియం ప్లస్‌ కేటగిరీని ప్రవేశపెట్టినట్లయిందని, ప్రస్తుతం పాత తరం ఐఫోన్‌ 5 లేదా 6 వేరియంట్స్‌ను ఉపయోగిస్తున్న వారు ఐఫోన్‌ 7 లేదా 8 సిరీస్‌కి అప్‌గ్రేడ్‌ కావొచ్చని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ అసోసియేటెడ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ తెలియజేశారు. ధర మొదలైన వాటితో సంబంధం లేకుండా భారత యూజర్లు కొత్త వేరియంట్స్‌కి మారే అవకాశం ఉన్నందున ప్రారంభ దశలో తాజా వేరియంట్స్‌ అమ్మకాలు బాగానే ఉంటాయని చెప్పారాయన. అయితే, ప్రీమియం సెగ్మెంట్‌లో శామ్‌సంగ్‌కి చెందిన ఎస్‌ 8, నోట్‌ 8 నుంచి వీటికి గట్టి పోటీ ఎదురుకావొచ్చన్నారు. సెప్టెంబర్‌ 21 నుంచి భారత మార్కెట్లో లభ్యమయ్యే శామ్‌సంగ్‌ నోట్‌ 8 రేటు రూ. 67,900. దేశీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో (రూ. 30,000 పైచిలుకు రేటు పలికేవి) శామ్‌సంగ్‌ వాటా  దాదాపు 68 శాతం దాకా ఉందని అంచనా.

120 కోట్ల ఐఫోన్‌ అమ్మకాలు..
హ్యాండ్‌సెట్స్‌ తయారీలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సంస్థ అయిన యాపిల్‌ ఇప్పటిదాకా 120 కోట్ల పైచిలుకు ఐఫోన్స్‌ విక్రయించింది. వృద్ధికి కీలకంగా మారుతున్న భారత మార్కెట్‌పై ఆశావహంగా ఉన్న యాపిల్‌.. ఇక్కడ గణనీయంగా ఇన్వెస్ట్‌ చేయడంపై దృష్టి పెట్టింది. యాప్‌ యాక్సిలరేటర్‌ సెంటర్‌ను ప్రారంభించడంతో పాటు మార్కెట్లో విస్తరించేందుకు భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌ను కూడా జూన్‌ త్రైమాసికం నుంచి భారత్‌లోనే తయారు చేయడం ప్రారంభించింది. కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం అమ్మకాలపరంగా దేశీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో 24 శాతం వాటాతో శాంసంగ్‌ అగ్రస్థానంలో ఉండగా, 2.3 శాతం వాటాతో యాపిల్‌ 11వ స్థానంలో ఉంది. అయితే, విలువపరంగా మాత్రం 10 శాతం వాటాతో యాపిల్‌ అయిదో స్థానంలో ఉంది.

రూ. 8వేల పైగా తగ్గిన 7 సిరీస్‌
కొత్త వేరియంట్స్‌ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పాత తరం ఐఫోన్‌ 6ఎస్, 6ఎస్‌ ప్లస్, 7, 7 ప్లస్‌ వేరియంట్ల ధరలు రూ. 8,300 దాకా తగ్గాయి. 32 జీబీ ఐఫోన్‌ 6ఎస్‌ ఫోను దేశీ మార్కెట్లో రూ. 46,900 నుంచి తగ్గి రూ. 40,000కి, 128 జీబీ స్టోరేజీ ఫోన్‌ రూ. 55,900 నుంచి రూ. 49,000కి లభిస్తోంది. ఇక, 6ఎస్‌ ప్లస్‌ (128జీబీ) ధర సైతం రూ. 65,000 నుంచి రూ. 58,000కి తగ్గింది. మరోవైపు ఐఫోన్‌ 7 ధర అత్యధికంగా తగ్గింది. ఇప్పటిదాకా రూ. 56,200 పలికిన 32 జీబీ స్టోరేజి వేరియంట్‌ ప్రస్తుతం రూ. 49,000కు దిగి వచ్చింది. అలాగే 128 జీబీ ధర రూ. 65,200 నుంచి రూ. 58,000కు తగ్గింది. 7 ప్లస్‌ రేటు(32జీబీ) రూ. 8,300 తగ్గి రూ. 59,000కే లభిస్తుంది.

Advertisement
Advertisement