లక్ష మందికి ఐటీ నోటీసులు | Sakshi
Sakshi News home page

లక్ష మందికి ఐటీ నోటీసులు

Published Wed, Nov 8 2017 1:06 AM

IT to issue 1 lakh notices for huge deposits post demonetisation - Sakshi

న్యూఢిల్లీ: గతేడాది పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం బ్యాంకుల్లో భారీగా డిపాజిట్లు చేసిన లక్ష మంది వ్యక్తులు, సంస్థలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేయనుంది. ఆయా వ్యక్తుల ఆదాయపన్ను రిటర్నులను పూర్తిస్థాయి దర్యాప్తునకు వీలుగా ఇప్పటికే సేకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నోటీసుల జారీ ఈ వారంలోనే మొదలవుతుందని పేర్కొన్నాయి.

తొలి దశలో భాగంగా రూ.50 లక్షలు ఆపైన డిపాజిట్లు చేసి, రిటర్నులు ఫైల్‌ చేయని, ఐటీ సూచనలను పెడచెవిన పెట్టిన 70,000 సంస్థలకు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 142(1) కింద నోటీసులు జారీ అవుతాయి.  డీమోనిటైజేషన్‌ తర్వాత డిపాజిట్లు, రిటర్నుల్లో భారీ వ్యత్యాసాలను గుర్తించిన మరో 30,000 మందికి కూడా స్క్రూటినీ నోటీసులు జారీ చేయనున్నట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. 

గతేడాది నవంబర్‌ 8 తర్వాత 23.22 లక్షల ఖాతాలకు సంబంధించి 17.73 లక్షల అనుమానిత కేసులను గుర్తించారు. ఇందులో 16.92 లక్షల ఖాతాలకు సంబంధించి 11.8 లక్షల మంది  నోటీసులకు ఆన్‌లైన్‌లో స్పందన తెలిపారు. అయితే, మరోసారి రూ.25 లక్షలకు పైన డిపాజిట్లు చేసిన వారిని నోటీసులకు స్పందించాలని కోరతామని, లేకుంటే వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఐటీ అధికారి తెలిపారు. 

Advertisement
Advertisement