ఇక జిల్లాల్లో మినీ ఐటీ హబ్‌లు.. | Sakshi
Sakshi News home page

ఇక జిల్లాల్లో మినీ ఐటీ హబ్‌లు..

Published Fri, Dec 18 2015 11:48 PM

ఇక జిల్లాల్లో  మినీ ఐటీ హబ్‌లు.. - Sakshi

♦ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మంలో ఏర్పాటు
♦ ముందుకొచ్చే కంపెనీలకు రాయితీలు
♦ హైదరాబాద్‌కు మరో 20 ఐటీ సంస్థలు
♦ తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడి
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
భాగ్యనగరికి పరిమితమైన ఐటీ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం జిల్లాలకూ విస్తరిస్తోంది. దీనికోసం నూతన ఐటీ విధాన ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మంలో మినీ ఐటీ హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ హబ్‌లలో కార్యాలయాలను నెలకొల్పే కంపెనీలకు  ప్రోత్సాహకాలతోపాటు అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం తెలిపారు.
 
  హైసియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ హబ్‌లలో మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. ‘డేటా అనలిటిక్స్ రంగ కంపెనీలకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు అనువైనవి. తక్కువ ఖర్చుతో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని స్థాయిల వరకు సాధారణ నైపుణ్యం ఉన్న ఉద్యోగులు సరిపోతారు’ అని అన్నారు. నూతన ఐటీ పాలసీని జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ప్రకటిస్తామన్నారు.
 
 మరో 20 ఐటీ సంస్థలు..
 హైదరాబాద్‌లో కార్యాలయాలను స్థాపించేం దుకు దేశ, విదేశాలకు చెందిన 20 కంపెనీల దాకా ఆసక్తిగా ఉన్నాయని జయేశ్ తెలిపారు. ఏడాదిలో ఇవి ఏర్పాటు అవుతాయన్నారు. ఈ కంపెనీలే తమ ప్రణాళికను త్వరలో వెల్లడిస్తాయని, చర్చలు పురోగతి దశలో ఉన్నాయన్నారు.  హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న ప్రతిపాదిత భారీ క్యాంపస్ కోసం గూగుల్‌కు స్థలం బదలాయించామని చెప్పారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ క్యాంపస్ కోసం భూమి పూజ జరిగే అవకాశం ఉందన్నారు.
 
 సిల్వర్ జూబ్లీ వేడుకలు..: సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎం టర్‌ప్రైసెస్ అసోసియేషన్(హైసియా) 15 మంది సభ్యులతో 1991లో ప్రారంభమైంది. రాష్ట్ర జీడీపీకి హైసియా సభ్య కంపెనీలు సుమారు రూ. 70,000 కోట్లు సమకూరుస్తున్నాయని టెక్ మహీంద్రా బీపీవో సీఈవో విజయ్ రంగినేని తెలి పారు. ప్రత్యక్షంగా 4 లక్షలు, పరోక్షంగా 10 లక్షల మంది ఐటీ రంగంలో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. 4 లక్షల మందిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 60% ఉంటారని హైసియా ప్రెసిడెంట్ రమేశ్ లోగనాథన్ పేర్కొన్నారు.

 భారత్‌పై తీవ్ర ప్రభావం..
 యూఎస్ ప్రభుత్వం హెచ్1బీ, ఎల్1 వీసా ఫీజుల పెంపు ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంటుందని సైయంట్ ఫౌండర్, నాస్కామ్ చైర్మన్  బీవీఆర్ మోహన్‌రెడ్డి అన్నా రు. ‘భారత ఐటీ కంపెనీలతో యూ ఎస్ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రయోజనం కలిగింది. ఇక్కడి కంపెనీలను ఇబ్బందులకు గురిచేసే చర్యలు అంత శ్రేయస్కరం కాదు. యూఎస్‌లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో నిపుణుల కొరత ఇంకా ఉంది’ అని చెప్పారు.
 

Advertisement
Advertisement