బెంగళూరులో యాపిల్ సెంటర్

18 May, 2016 19:30 IST|Sakshi
బెంగళూరులో యాపిల్ సెంటర్

బెంగళూరు: భారత్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు మహానగరానికి మరో అంతర్జాతీయ ఐటీ కంపెనీ వస్తోంది. టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. యాప్ డిజైన్, డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 2017వ సంవత్సరం ఆరంభంలో దీన్ని ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.

వారంరోజుల భారత పర్యటన కోసం కుక్ మంగళవారం అర్థరాత్రి ముంబైకి వచ్చిన సంగతి తెలిసిందే. ముంబైలోని ప్రముఖ సిద్ది వినాయక ఆలయాన్ని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన కుక్.. యాప్ డిజైన్, డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు వివరాలను వెల్లడించారు. యాపిల్.. ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం వల్ల వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. భారత్ లో ఐఓఎస్ డెవలపర్ కమ్యూనిటీ వృద్ధిచెందేందుకు దోహదం చేయనుంది. యాపిల్ కంపెనీకి సంబంధించి అన్నిరకాల ఉత్పత్తులకు యాప్లు తయారు చేయనున్నారు. వీటితో పాటు ఐఓఎస్, మాక్, యాపిల్ టీవీ, యాపిల్ వాచ్లకు యాప్లను రూపొందించనున్నారు.

ప్రపంచంలో ఐఓఎస్ డెవలప్మెంట్ కమ్యూనిటీల్లో భారత్ కీలకమైనదని కుక్ అన్నారు. బెంగళూరులో యాప్ డిజైన్, డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడి డెవలపర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు యాప్లు రూపొందించవచ్చని చెప్పారు. సిలికాన్ వ్యాలీ తర్వాత అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీ ఉన్న నగరం బెంగళూరే కావడం విశేషం. డెవలపర్లను ప్రోత్సహించి, తగిన సూచనలు ఇచ్చి, వారి నైపుణ్యంతో అత్యుత్తమ యాప్లను తయారు చేయడానికి యాపిల్ టీమ్ సాయపడుతుందని కుక్ చెప్పారు. భవిష్యత్లో యాపిల్ ఉత్పత్తుల మార్కెట్కు భారత్ను కుక్ కీలకంగా భావిస్తున్నారు. ఐఫోన్ల అమ్మకాలతో పాటు భారత టెక్ కమ్యూనిటీలో యాపిల్ సంస్థ భాగం కావాలని కోరుకుంటున్నారు.

టిమ్‌కుక్ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. సిటీలో మూడు గంటలపాటు ఉంటారు. హైదరాబాద్లో యాపిల్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించే అవకాశముందని భావిస్తున్నారు. కుక్ రాకకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కుక్ ఇక్కడి పర్యటన అనంతరం ఢిల్లీ వెళతారు. 20, 21 తేదీల్లో అక్కడే ఉంటారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. మేకిన్ ఇండియా అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం.

మరిన్ని వార్తలు