నష్టాల్లోకి జెట్‌ ఎయిర్‌వేస్‌ | Sakshi
Sakshi News home page

నష్టాల్లోకి జెట్‌ ఎయిర్‌వేస్‌

Published Thu, May 24 2018 1:01 AM

Jet Airways reports Q4 loss at Rs 1045 crore - Sakshi

ముంబై: పెరిగిన ఇంధన ధరలు, బలహీన పడిన రూపాయి విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ను నష్టాల్లోకి నెట్టేశాయి. మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.1,036 కోట్ల స్టాండలోన్‌ నష్టాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.602 కోట్ల లాభాన్ని ఆర్జించడం గమనార్హం. మొత్తం ఆదాయం సైతం 3.44 శాతం తగ్గి రూ.6,271 కోట్ల నుంచి రూ.6,055 కోట్లకు పరిమితం అయింది. ముఖ్యంగా వ్యయాలు 31 శాతం పెరిగిపోయాయి. రూ.1,282 కోట్ల నుంచి రూ.2,063 కోట్లకు చేరాయి.

బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు అదే పనిగా పెరుగుతూ వెళ్లడం, అదే సమయంలో ప్రయాణికుల చార్జీలను పెంచకపోవడం, బలహీన రూపాయి కారణంగా మార్క్‌ టు మార్కెట్‌ సర్దుబాటు మార్చి త్రైమాసికంలో ఆర్థిక పనితీరు బలహీనంగా ఉండడానికి కారణమని జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో వినయ్‌దూబే పేర్కొన్నారు. ఇంధన ధరల పెరుగుదల భారం రూ.355 కోట్లుగా ఉండగా, బలహీన రూపాయి కారణంగా నష్టాలు రూ.156 కోట్లు వచ్చినట్టు కంపెనీ పేర్కొంది.  

Advertisement
Advertisement