విస్తరణ బాటలో కామినేని..! | Sakshi
Sakshi News home page

విస్తరణ బాటలో కామినేని..!

Published Sat, May 24 2014 1:23 AM

విస్తరణ బాటలో కామినేని..! - Sakshi

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ సంస్థ కామినేని హాస్పిటల్స్ కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఐదేళ్లలో మరో 1,000 పడకలను జత చేయనుంది. దీనికోసం రూ.500 కోట్లు వ్యయం చేయనుంది. మరోవైపు, విజయవాడలో రూ.100 కోట్ల వ్యయంతో కామినేని హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్న ఆసుపత్రిలో జూలైలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సంస్థకి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎల్‌బీ నగర్, కింగ్‌కోటి, నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద  ఆసుపత్రులున్నాయి. అలాగే, రెండు వైద్య కళాశాలలు, ఒక ఫెర్టిలిటీ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోంది. సంస్థ వృద్ధికి అవసరమైతే సాంకేతిక సేవలు లేదా రోగి సంరక్షణ సేవల్లో ఉన్న కంపెనీతో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కామినేని హాస్పిటల్స్ ఎండీ కామినేని శశిధర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు.  

 విస్తరణకు అందరూ సిద్ధం..
 ఒక లక్ష జనాభా ఉన్న పట్టణాల్లో కూడా ఆధునిక ఆసుపత్రుల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కావాల్సిందల్లా ప్రభుత్వం నుంచి ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో అధిక కేటాయింపులేనని శశిధర్ చెప్పారు. ఆసుపత్రులు రావాలంటే స్థానికంగా మౌలిక వసతులు, కమ్యూనికేషన్ వ్యవస్థ, అనువైన ప్రదేశం తప్పనిసరి అన్నారు. 300 పడకల ఆసుపత్రి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సామాన్యుడికి నాణ్యమైన వైద్యం చేరువ అవుతుందని వివరించారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి రోగులు నగరానికి వచ్చే అవసరమే లేదన్నారు. అన్నీ ఒకేచోట కాకుండా, 100 మందికి ఒక పడక చొప్పున, జనాభా, ఆరోగ్య సమస్యల ఆధారంగా ఆసుపత్రులు విస్తరించాలని సూచించారు.

 ఒకే విధానం ఉండాలి..
 ఆసుపత్రులకు వైద్య ఖర్చులు చెల్లించే విషయంలో భిన్న విధానాలకు స్వస్తి పలకాలని శశిధర్ కోరారు. ‘ఒక్కో చికిత్సకు ఎంత ఖర్చు అవుతుందో సుస్పష్టం. అలాంటప్పుడు సీజీహెచ్‌ఎస్, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా రోగులకు వేర్వేరు ప్యాకేజీలు ఎందుకు. ప్రభుత్వం చెల్లిస్తామంటున్న మొత్తానికి, ఆసుపత్రులు కోరుతున్న మొత్తానికి భారీ వ్యత్యాసమే ఉంటోంది. ఈ అస్పష్టతను తొలగించి ఒకే ఒక విధానం అమలు చేయాలి. సబ్సిడీతో ఇచ్చే వైద్యానికి పన్ను మినహాయించాలి’ అని తెలిపారు. ఆసుపత్రులకు వైద్యం తాలూకు డబ్బులు వచ్చేసరికి దాదాపు రెండేళ్ల సమయం కూడా పడుతోందని చెప్పారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నేరుగా నగదు చెల్లించి వైద్యం చేయించుకునేవారు 30 శాతంలోపే ఉంటారని ఆయన పేర్కొన్నారు. మందులు, పరికరాలన్నీ నగదు చెల్లించే కొనడం వల్ల ఆసుపత్రులపై ఆర్థిక భారం పడుతోందని, బ్యాంకుల కోసమే ఆరోగ్య సేవలు అందిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. రోగి డిశ్చార్జి అయిన నెల రోజు ల్లోగా చెల్లింపులు పూర్తికావాలని అన్నారు.

Advertisement
Advertisement