Sakshi News home page

అటకెక్కిన కామినేని విస్తరణ!

Published Wed, Mar 12 2014 12:51 AM

అటకెక్కిన కామినేని విస్తరణ!

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటూ... పూర్తి సామర్థ్యంలో కనీసం 10-20 శాతం కూడా ఉత్పత్తిని సాధించలేని దశలో కామినేని గ్రూపు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. నీటి విడుదల కోసం ఇప్పటికే ప్రభుత్వాన్ని అభ్యర్థించటంతో పాటు కేంద్రం యాజమాన్యంలోని మానిటరింగ్ గ్రూపు ప్రభుత్వానికి మెమోలు జారీ చేసినా ఫలితం లేకపోవటంతో కంపెనీ ప్రత్యామ్నాయాలపై పడింది. నేరుగా కేంద్రానికి లేఖ రాయటంతో పాటు అవసరమైతే ప్లాంటును ఉత్తరాదికో, మరో చోటికో తరలించే మార్గాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తోంది.

 ప్రస్తుతం కామినేని గ్రూపు ఆధ్వర్యంలో ఆసుపత్రితో పాటు (కేఎస్‌పీఎల్), యునెటైడ్ సీమ్‌లెస్ ట్యూబ్యులర్(యూఎస్‌టీపీఎల్), ఆయిల్ కంట్రీ ట్యూబ్యులర్ వంటి సంస్థలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థలన్నీ నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్దే కేంద్రీకృతమయ్యాయి. వీటిలో ఆయిల్ కంట్రీ ట్యూబ్యులర్ సంస్థ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది కూడా. బిల్లెట్ల తయారీలో ఉన్న కేఎస్‌పీఎల్ 2011 జూన్‌లో కార్యకలాపాలు ఆరంభించింది. అయితే వాణిజ్య కార్యకలాపాలు మాత్రం ఈ నెల్లోనే మొదలయ్యాయి. ఇక్కడ తయారయ్యే బిల్లెట్లను యూఎస్‌టీపీఎల్‌కు సరఫరా చేస్తారు. అది ముడి పైపుల్ని ఉత్పత్తి చేస్తుంది.

అనంతరం వాటిని ఆయిల్ కంట్రీ ట్యూబ్యులర్ కొనుగోలు చేసి.. తుది మెరుగులు దిద్దుతుంది. ఈ 3 ప్లాంట్లూ దాదాపు నార్కట్ పల్లిలోని 250 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటికితోడు కేఎస్‌పీఎల్ ఇక్కడే 220 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ‘‘18 నెలల్లో ఉత్పత్తి మొదలవుతుంది. దీనిని 500 మెగావాట్ల వరకు విస్తరించే అవకాశం కూడా ఉంది. ఉత్పత్తయ్యే విద్యుత్‌లో సగం మా అవసరాలకు వాడుకుంటాం. మిగిలింది గ్రిడ్‌కు అనుసంధానం చేస్తాం’’ అని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే కేఎస్‌పీఎల్, యూఎస్‌టీపీఎల్‌పై గ్రూపు ఇప్పటిదాకా రూ.2,500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.

 నీటి కొరతతో తగ్గిన ఉత్పత్తి...
 నార్కట్ పల్లి ప్లాంట్లకు సరఫరా కావాల్సిన నీటి విషయంలో వివాదం రేగటంతో ఆ ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. యూఎస్‌టీపీఎల్ వార్షిక సామర్థ్యం 3 లక్షల టన్నులైనా ప్రస్తుతం 30వేల టన్నులే ఉత్పత్తవుతోంది. కేఎస్‌పీఎల్ వార్షిక సామర్థ్యం 3.5 లక్షల టన్నులు కాగా నెలకు 5 వేల టన్నులే ఉత్పత్తవుతోంది. నీరు లేక యూఎస్‌టీపీఎల్ ఉత్పత్తి ఏడాదిన్నర ఆలస్యం కాగా... ప్రస్తుతం భూగర్భ నీటితోపాటు వర్షపు నీటిని నిల్వ చేసి అరకొర ఉత్పత్తి సాగిస్తున్నారు. దీంతో నిర్వహణ వ్యయాలూ భారీగా పెరిగిపోయాయి. నిజానికి 2 ప్లాంట్లూ పూర్తి సామర్థ్యంతో నడిస్తే యూఎస్‌టీపీఎల్ నుంచి 60%, కేఎస్‌పీఎల్ నుంచి 80% మేర ఎగుమతులకు ఆస్కారం ఉంది.

రూ.వెయ్యి కోట్ల పైబడిన ప్రాజెక్టుల అమలును కేబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ సారథ్యంలోని మాని టరింగ్ గ్రూపు పర్యవేక్షిస్తోంది. కేఎస్‌పీఎల్, యూఎస్‌టీపీఎల్ కూడా దీని పర్యవేక్షణలో ఉన్నాయి. నార్కట్‌పల్లి ప్లాంట్లకు నీటి సరఫరాపై రాష్ట్ర సర్కారుకు ఈ గ్రూపు మెమోలూ జారీ చేసింది. అయి నా లాభం లేకపోవటంతో... రూ.3,000 కోట్లతో ప్రతిపాదించిన విస్తరణను కంపెనీ ప్రస్తుతానికి పక్కనబెట్టింది. విస్తరణ లేనట్టే.
 
 బ్యాంకర్లు వద్దన్నా...
 బిల్లెట్లు, పైపులు రెండూ తయారు చేసే గ్రూపు మాదొక్కటే. కర్ణాటక సర్కారు ఆహ్వానించినా, గుజరాత్ ను పరిశీలించినా... మన ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న మా చైర్మన్ ఆకాంక్ష మేరకు నార్కట్‌పల్లిలో నెలకొల్పాం. బ్యాంకర్లు వద్దన్నా, ప్రభుత్వ సబ్సిడీలు కూడా తీసుకోకుండా సొంత నిధులతో ఏర్పాటుచేశాం. 3,000 మంది ఉద్యోగులున్నారు. ఉదయసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఏటా 0.091 టీఎంసీల నీటిని ప్రభుత్వమే కేటాయించినా ప్రస్తుతం అందటం లేదు. ఈ వివాదాన్ని ఊహించి ఉంటే ఇంత పెట్టుబడి పెట్టేవాళ్లం కాదేమో!!  నష్టాలతో ఎక్కువకాలం ప్లాంట్లను నడపలేం.  - కామినేని శశిధర్, గ్రూప్ డెరైక్టర్

Advertisement
Advertisement