చివరి శ్వాస వరకు పాత నోట్లను మార్చుకోలేక.. | Sakshi
Sakshi News home page

చివరి శ్వాస వరకు పాత నోట్లను మార్చుకోలేక..

Published Fri, Aug 18 2017 8:34 PM

చివరి శ్వాస వరకు పాత నోట్లను మార్చుకోలేక..

సాక్షి, కేరళ : కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం పెద్ద నోట్ల రద్దు.. ఈ నోట్ల రద్దు సంగతి మారుమూల పల్లెల్లో ఉన్న ఒంటిరిగా బతుకు బండి లాగుతున్న ఓ వృద్ధురాలికి ఏం తెలుసు. ఈ విషయం తెలియక తన వద్దనున్న 4 లక్షల పాత కరెన్సీని కొత్త కరెన్సీలోకి మార్చుకోలేకపోయింది. ఆ విషయం తెలిశాక అయినా మార్చుకుందామంటే గడువు తీరిపోయింది.
 
కనీసం ప్రభుత్వం కానీ, అధికారులు కానీ పట్టించుకోలేదు. వారు కూడా పాత నోట్లను కొత్త నోట్లలోకి మార్చుకునేందుకు ఆ వృద్దురాలికి అవకాశం ఇవ్వలేదు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆ వృద్ధురాలు గురువారం రాత్రి తన చివరి శ్వాస విడిచింది. తన చివరి శ్వాస వరకు ఈ నోట్లను మార్చుకోవడానికే తెగ శ్రమించింది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. ఆమెనే కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన 70 ఏళ్ల సతీ భాయ్‌. 
 
నవంబర్‌లో ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసింది. ఒంటరిగా బయట వాతావరణంతో పెద్దగా పరిచయం లేకుండా జీవిస్తున్న సతీ భాయ్‌కు ఈ విషయం తెలియదు. జనవరిలో ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొనుగోలుచేయడానికి పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లిన ఆమెకు, తాను తీసుకెళ్లిన రూ.1000 నోటు పనికిరాదని తెలిసింది. అప్పటికే డెడ్‌లైన్‌ ముగియడంతో నోట్లను మార్చుకోవడానికి చాలా ప్రయాసలే పడాల్సి వచ్చింది. వరపుజా పంచాయతీ సభ్యులు కూడా ఆమె పాత నోట్లను మార్చడానికి చాలా శ్రమించారు.
 
ఓ కమిటీగా ఏర్పాడ్డారు కూడా. అన్ని డాక్యుమెంట్లను సేకరించి, సతీ భాయ్‌కి సహకరించడానికి చెన్నై వరకు వెళ్లారు. కానీ నిర్దేశించిన సమయం అయిపోవడంతో, వారికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి పర్మిషన్‌ అవసరం పడింది. మంత్రిత్వ శాఖ దగ్గరకు వెళ్లినా ఎలాంటి ఫలితం దక్కలేదని పంచాయతీ వార్డు సభ్యుడు పోలీ టీపీ చెప్పారు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆమె బాధపడుతుండటంతో,  కొన్ని వారాల క్రితమే కేర్‌ హోమ్‌లో చేర్పించారు.  సతీ భాయ్‌ని ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా  తామున్నామని, గత రాత్రి ఆమె మరణించినట్టు ఆయన తెలిపారు. 
 
రాష్ట్ర పశువైద్య విభాగం నుంచి సతీ భాయ్‌ 20 ఏళ్ల క్రితమే రిటైర్‌ అయింది. అప్పటి నుంచి ఒక్కతే ఒక చిన్న ఇంటిలో నివాసముంటుంది. బయట ప్రపంచంతో ఆమెకు పెద్దగా పరిచయం కూడా లేదు. రిటైర్‌ అయినప్పుడు వచ్చిన నగదును భద్రంగా దాచుకుంది. ఈ మొత్తమంతా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిరూపయోగంగా మారింది.
 
అయితే తన నగదు మాత్రమే కాక, సతీ భాయ్‌ అకౌంట్‌లో రూ.10 లక్షలు డిపాజిట్‌ అయినట్టు జనవరిలో బ్యాంకు అధికారులు చెప్పారు. బ్యాంకు అధికారులు సమాచారంతో వెంటనే ఆమె ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సెల్ఫ్‌లో ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో దాచి ఉంచిన నగదును గుర్తించారు. ఇక్కడికి వచ్చిన వారందరూ తనను మోసం చేయడానికే వచ్చినట్టు అప్పట్లో సతీభాయ్‌ చెప్పింది. కానీ తన అసలైన నగదును మాత్రం తను కన్నుమూసేవరకు మార్చుకోలేకపోయింది. 

Advertisement
Advertisement