టీఎస్-ఐపాస్‌పై సిస్కో ఆసక్తి | Sakshi
Sakshi News home page

టీఎస్-ఐపాస్‌పై సిస్కో ఆసక్తి

Published Sun, May 17 2015 2:34 AM

టీఎస్-ఐపాస్‌పై సిస్కో ఆసక్తి - Sakshi

సంస్థ చైర్మన్‌ను రాష్ట్రానికి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన పారిశ్రామిక విధానం(టీఎస్-ఐపాస్) పట్ల ప్రఖ్యాత నెట్‌వర్కింగ్ కంపెనీ సిస్కో సిస్టమ్స్ చైర్మన్ జాన్ చాంబర్స్ ఆసక్తిని కనబరిచారు. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు శనివారం శాన్‌జోస్ నగరంలోని సిస్కో కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. టీఎస్-ఐపాస్‌లోని కీలక అంశాలను సిస్కో చైర్మన్‌కు మంత్రి కేటీఆర్ వివరించారు. పారదర్శకమైన పారిశ్రామిక విధానం, పరిపాలనా సౌల భ్యాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి జాన్ చాంబర్స్ అభినందనలు తెలిపారు.

తెలంగాణలో పరిశ్రమల స్థాపనకున్న విస్తృత అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని సిస్కో చైర్మన్‌ను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ రంగంలో పేరుగాంచిన జనరల్ ఎలక్ట్రికల్స్(జీఈ) సంస్థ మాజీ చైర్మన్ జాక్‌వెల్స్‌తో మంత్రి కేటీఆర్ సంభాషించారు. జాక్‌వెల్స్ వంటి పారిశ్రామిక వేత్త ఇచ్చిన సూచనలు, సలహాలు తెలంగాణ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు.

అనంతరం శాంతాక్లారా కన్వెన్షన్ సెంటర్‌లో ది ఇండస్ ఎంటర్‌పెన్యూర్స్ ఏర్పాటు చేసిన టైకాన్ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్ ప్రత్యేకతలను వారికి వివరించారు. ఆపై సన్ మైక్రో సిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్‌కోస్లాతో భేటీ అయిన కేటీఆర్.. సాంకేతిక రంగానికి సంబంధించి ప్రపంచంలో వస్తున్న అధునాతన మార్పులపై చర్చించారు.

Advertisement
Advertisement