గతవారం బిజినెస్ | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Sep 26 2016 12:41 AM

గతవారం బిజినెస్

ఓఎన్‌జీసీ విదేశ్‌కు 6,100 కోట్ల పన్ను నోటీసు
ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్‌జీసీ) విదేశీ సబ్సిడరీ ఓఎన్‌జీసీ విదేశ్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.6,100 కోట్లకుపైగా సేవా పన్ను నోటీసును జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లోని 37 చమురు, గ్యాస్ ప్రాజెక్టుల్లో ఓఎన్‌జీసీ విదేశ్‌కు వాటాలు ఉన్నాయి. అనుబంధ సంస్థలు, బ్రాంచీలు, జాయింట్ వెంచర్ల రూపంలో ఈ వాటాలు కొనసాగుతున్నాయి. సంబంధిత సంస్థలు, బ్రాంచీలు, జేవీల కార్యకలాపాలకు సంబంధించే తాజా పన్ను నోటీస్ జారీ అయ్యింది. అయితే ఆయా మార్గాల ద్వారా పెట్టుబడులు సేవల పన్ను పరిధిలోనికి రావని ఓఎన్‌జీసీ విదేశ్ పేర్కొంటోంది.

 అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ విద్యు త్ ప్లాంటును తమిళనాడులో అదానీ గ్రూప్ ప్రారంభించింది. దీనిని జాతికి అంకితం చేసినట్లు గ్రూప్‌లో భాగమైన అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రకటించింది. రూ.4,550 కోట్ల పెట్టుబడులతో 648 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్లాంటు ప్రపంచంలోనే అతిపెద్దదని పేర్కొంది. రామనాథపురం కౌముది వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటయ్యింది. కాగా అదానీ గ్రూప్‌కు చెందిన ఒడిస్సాలోని రూ.6,000 కోట్ల ధామ్రా ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టులో 50 శాతం వాటాలను తీసుకునేందుకు సంబంధించిన ఒప్పందంపై ఐఓసీ (39 శాతం), గెయిల్ ఇండి యా (11 శాతం)లు సంతకాలు చేశాయి. మిగిలిన 50 శాతం వా టాను అదానీ పెట్రోలియం టెర్మినల్ లిమిటెడ్ కలిగి ఉంటుంది.

 మొబైల్‌తో కొటక్ మహీంద్రా అకౌంట్
ప్రైవేట్ రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా తాజాగా బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది తాజాగా ‘కొటక్ నౌ’ యాప్ సాయంతో బ్యాంక్ అకౌంట్‌ను తెరిచే వెసులుబాటును కస్టమర్లకు కల్పిస్తోంది. దీంతో అకౌంట్ ఓపెనింగ్ సులభతరం కావడంతోపాటు బ్యాంకుకు ఖాతా తెరవడానికి అయ్యే వ్యయం కూడా సగానికి తగ్గే అవకాశముంది. ఒక బ్యాంక్ ఇలాంటి సేవలను ప్రారంభించడం దేశంలో ఇదే తొలిసారి. ‘మా కొత్త యాప్ సాయంతో కస్టమర్ కేవలం 10 నిమిషాల్లో బ్యాంక్ అకౌంట్‌ను తెరవొచ్చు. దీనికోసం బ్యాంక్ శాఖలను సంప్రదించాల్సిన అవస రం లేదు’అని బ్యాంక్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ దీపక్ శర్మ తెలిపారు.

 సిగ్నా టీటీకేతో ఆంధ్రా బ్యాంక్ జట్టు
బీమా సంస్థలు సిగ్నా టీటీకే, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఆంధ్రా బ్యాంకు కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ప్రకారం సిగ్నా టీటీకే ఆరోగ్య బీమా పాలసీలను, రిలయన్స్‌కి చెందిన సాధారణ బీమా పాలసీలను విక్రయించనుంది. పాలసీల విషయంలో ఖాతాదారులకు మరిన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంచేందుకు ఈ ఒప్పందాలు తోడ్పడగలవని బ్యాంకు పేర్కొంది.

 ఫోర్బ్స్ ఇండియా కుబేరుల్లో పతంజలి ఎండీ
అమెరికా బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తాజాగా రూపొందించిన భారత్‌లోని వంద మంది అత్యంత ధనవంతుల జాబితాలో పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డెరైక్టర్, ప్రధాన వాటాదారు ఆచార్య బాల్‌కృష్ణ తొలిసారి స్థానం పొందారు. ఈయన 2.5 బిలియన్ డాలర్ల సంపదతో 48వ స్థానంలో నిలిచారు. జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఈయన సంపద 18.9 బిలియన్ డాలర్ల నుంచి 22.7 బిలియన్ డాలర్లకి చేరింది. అంబానీ తర్వాత రెండో స్థానంలో సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వీ ఉన్నారు. ఈయన సంపద విలువ 16.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక హిందూజా సోదరులు ఒకస్థానం ఎకబాకి 15.2 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు.

 క్లౌడ్ యూజర్లలో ఆ కంపెనీలే ఎక్కువ!
తమ దేశీ క్లౌడ్ సర్వీస్‌లకు హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన కంపెనీలు సహా పలు స్టార్టప్స్ కూడా ప్రధాన క్లయింట్స్‌గా ఉన్నాయని టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసింది. బీఎస్‌ఈలో లిసై ్టన టాప్-100 కంపెనీల్లో 52 సంస్థలు తమ క్లౌడ్ సేవలను ఉపయోగించుకుంటున్నాయని కంపెనీ పేర్కొంది. కాగా మైక్రోసాఫ్ట్ క్లయింట్స్‌లో ఫోర్టిస్ హెల్త్‌కేర్, అపోలో హాస్పిటల్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ, పేటీఎం, జస్ట్‌డయల్, స్నాప్‌డీల్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కంపెనీకి క్లయింట్‌గా ఉంది.

 విదేశీ రుణ భారం 485 బిలియన్ డాలర్లు
భారత్ విదేశీ రుణ భారం 2016 మార్చి నాటికి 485.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 2.2 శాతం (10.6 బిలియన్ డాలర్లు) పెరిగింది. దీర్ఘకాల రుణ భారం ప్రత్యేకించి ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ల రూపంలో పెరిగింది. వార్షికంగా ఇది 3.3 శాతం పెరిగి 402.2 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఒక నివేదిక తెలిపింది. స్వల్పకాలిక రుణ భారం 2.5 శాతం తగ్గి 83.4 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. వాణిజ్య సంబంధ రుణాలు తగ్గడం దీనికి ప్రధాన కారణం.

పసిడి దిగుమతులు వెలవెల
భారత్ పసిడి దిగుమతులు ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్- ఆగస్టు) గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 60.5 శాతం తగ్గాయి. విలువ రూపంలో 15.42 బిలియన్ డాలర్ల నుంచి 6.08 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు పేర్కొన్నాయి. విదేశీ మారకపు చెల్లింపుల అవసరం తగ్గడం వల్ల ఇది కరెంట్ అకౌంట్‌కు లాభించే పరిణామమని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

తగ్గిన కరెంట్ అకౌంట్ లోటు
భారత్ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ- క్యాడ్) ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి స్వల్ప స్థాయిలో నమోదయ్యింది. సంబంధిత త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.1 శాతం (300 మిలియన్ డాలర్లు)గా క్యాడ్ నమోదయినట్లు ఆర్‌బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. ఎఫ్‌డీఐ,ఎఫ్‌ఐఐ, ఈసీబీలు మినహా నిర్దిష్ట కాలంలో దేశం చెల్లించే-పొందే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. పసిడి సహా పలు కమోడిటీల దిగుమతులు భారీగా పడిపోవడం, ఇతర దేశాలకు చెల్లింపులు తగ్గడం వంటి కారణాలతో క్యాడ్ దిగివచ్చింది.

 వొడాఫోన్ ఇండియాకి భారీ పెట్టుబడులు
రిలయన్స్ జియో ప్రవేశంతో టెలికం మార్కెట్లో పోటీ పెరిగిన నేపథ్యంలో వొడాఫోన్ ఇండియాకు బ్రిటన్ మాతృ సంస్థ వొడాఫోన్ నుంచి భారీ పెట్టుబడులు వచ్చాయి. తాజా మూలధనం రూపంలో రూ. 47,700 కోట్ల నిధులు అందినట్లు వొడాఫోన్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ సూద్ వెల్లడించారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా భారీగా నిధులు సమీకరించాలన్న ప్రణాళికను ఇంతకుమునుపు కంపెనీ ప్రకటించింది. అయితే తక్షణ అవసరాల కోసం మాతృ సంస్థ హుటాహుటిన ఈ పెట్టుబడులు పంపించింది. భారత్‌లోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) ఇదేనని సూద్ చెప్పారు.

 మైక్రోసాఫ్ట్ కొత్త నోకియా ఫీచర్ ఫోన్
టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’ తాజాగా ‘నోకియా 216’ అనే కొత్త మొబైల్ ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 2,495గా ఉంది. ఇందులో డ్యూయెల్ కెమెరా, డ్యూయెల్ సిమ్, ఎఫ్‌ఎం రేడియో, ఎంపీ3, వీడియో ప్లేయర్, బ్లూటూత్ ఆడియో సపోర్ట్, 1,020 ఎంఏహెచ్ బ్యాటరీ, మెమరీ కార్డ్ సపోర్ట్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. యూజర్లు ఒపెరా మొబైల్ స్టోర్ నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, అలాగే 2,000 వరకూ కాంటాక్ట్స్‌ను సేవ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఫోన్లు భారత్‌లో అక్టోబర్ 24 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నవి.

స్పెక్ట్రమ్ వేలం రేసుకు ఏడు సంస్థలూ రెడీ
అక్టోబర్ తొలి వారంలో జరగనున్న మెగా స్పెక్ట్రమ్ వేలం రేసు నుంచి ఏ ఒక్క సంస్థా తప్పుకోలేదు. దరఖాస్తుల ఉపసంహరణ గడువు ఈ నెల 22తో ముగియగా బరిలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, టాటా టెలీ, ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ ఉన్నట్టు టెలికం శాఖ తెలిపింది. అయితే, దరఖాస్తుల సమర్పణ చివరి రోజునఆర్‌కామ్, ఎయిర్‌సెల్ విలీనమవుతున్నట్టు ప్రకటించడంతో.. ఈ రెండూ విడివిడిగా బిడ్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement
Advertisement