రెండేళ్లలో 20వేల కోట్ల గృహరుణాలు | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో 20వేల కోట్ల గృహరుణాలు

Published Fri, Feb 12 2016 1:15 AM

రెండేళ్లలో 20వేల కోట్ల గృహరుణాలు

టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ ఆర్.వైద్యనాథన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండేళ్లలో హౌసింగ్‌లోన్ పోర్ట్‌ఫోలియో రూ. 20,000 కోట్ల మార్కును అధిగమిస్తుందన్న ధీమాను టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వ్యక్తం చేసింది. ప్రస్తుతం రూ. 13,000 కోట్లుగా ఉన్న హౌసింగ్ లోన్ వాటా ఏటా 40 శాతం వృద్ధితో రెండేళ్లలో రూ. 20,000 కోట్ల స్థాయిని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు టాటా హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ ఆర్.వైద్యనాథన్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి ఇంటి రుణాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.

రూ. 15 లక్షల లోపు రుణాల విలువ ప్రస్తుతం రూ. 1,800 కోట్లుగా ఉందని, ఇదే రెండేళ్లలో రూ. 4,000 కోట్ల మార్కును చేరుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు. మూడు లక్షలలోపు ఆదాయం ఉండి, రూ. 15 లక్షల లోపు రుణం తీసుకునే గ్రామీణ ప్రాంతాల్లో వారికి కేంద్రం ఇస్తున్న సబ్సిడీ వడ్డీరేటు పథకంలో తాము పాలుపంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రూ.15 లక్షల లోపు రుణాలకు 9.2 శాతానికే గృహరుణాలను ఇస్తున్నామని, ఇందులో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం సబ్సిడీని అందిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 70గా ఉన్న శాఖల సంఖ్యను ఈ ఏడాది చివరి నాటికి 100కు పెంచనున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement