పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా సిమెంటు | Sakshi
Sakshi News home page

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా సిమెంటు

Published Thu, Apr 23 2015 1:02 AM

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా సిమెంటు

పన్ను ఆదాయంకోల్పోతున్న తెలుగు రాష్ట్రాలు
* రోజుకు 6,000 టన్నుల సిమెంటు రాక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొందరు సిమెంటు వ్యాపారుల కారణంగా తెలుగు రాష్ట్రాలు పన్ను ఆదాయాన్ని కోల్పోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లాలకు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి సిమెంటు అక్రమంగా రవాణా అవుతోంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది.

గత కొంత కాలంగా ఈ తంతు జరుగుతోందని తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌కు, ఒడిశా నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు, అలాగే ఛత్తీస్‌గఢ్ నుంచి ఖమ్మంకు సిమెంటు రవాణా అవుతోంది. వివిధ రాష్ట్రాల్లో సిమెంటు ధరల తారతమ్యం ఉంది. దీనికితోడు తెలుగు రాష్ట్రాల్లో సిమెంటు దిగుమతిపై ఎంట్రీ ట్యాక్స్ లేకపోవడంతో వ్యాపారులు అదనుగా తీసుకుంటున్నారు.
 
నెలకు రూ. 18 కోట్లు..
మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒరిస్సా నుంచి రోజుకు సుమారు 6 వేల టన్నుల సిమెంటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు దిగుమతి అవుతోందని సమాచారం. పొరుగు రాష్ట్రాల్లో అమ్మకాలు నమోదు కావడంతో ఆ మేరకు తెలుగు రాష్ట్రాలకు ఆదాయం రాకుండా పోతోంది. సిమెంటుపై వ్యాట్ 14.5% ఉంది. అంటే ఒక్కో బస్తాపై వ్యాట్ సుమారు రూ.45-50లు అవుతుంది. రోజుకు 6 వేల టన్నుల సిమెంటు దిగుమతి అవుతోందంటే ఈ లెక్కన నెలకు రూ.18 కోట్ల పన్ను ఆదాయాన్ని రెండు రాష్ట్రాలు చేజార్చుకుంటున్నాయి.

‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక వ్యాపారికి సిమెంటు పంపాలంటే అక్కడి ప్రభుత్వ వెబ్‌సైట్ ఇ-సుగమ్ ద్వారానే లావాదేవీలు జరపాల్సిందే. ఈ విధానంతో ఆ వ్యాపారి నుంచి కర్ణాటక ప్రభుత్వానికి వ్యాట్ ఖచ్చితంగా వస్తుంది. ఇటువంటి వ్యవస్థ ఇక్కడ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయి’ అని ఒక ప్రముఖ కంపెనీ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement