రచ్చ గెలిచాం, ఇంట మాత్రం నిరాశ | Sakshi
Sakshi News home page

రచ్చ గెలిచాం, ఇంట మాత్రం నిరాశ

Published Thu, May 1 2014 1:43 AM

రచ్చ గెలిచాం, ఇంట మాత్రం నిరాశ

న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం అంతర్జాతీయంగా అద్భుతాలు సృష్టిస్తోందని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ చెప్పారు. భారత ఐటీ రంగం రచ్చ గెలుస్తోంది కానీ, ఇంట మాత్రం చతికిలపడుతోందని ఆయన బుధవారం చెప్పారు. ఐటీ పరిశ్రమ అంటే భారతేనన్న పేరు వస్తోందని పేర్కొన్నారు. భారత ఐటీ రంగం ఒకప్పుడు 12-14 శాతం చొప్పున వృద్ధి సాధించిందని వివరించారు. కానీ దేశీయంగా చూస్తే ఈ రంగం ఆదాయం నిరాశాజనకంగా ఉందని వివరించారు. గత ఏడాది దేశీయ ఐటీ రంగం ఆదాయం అంతంత మాత్రంగానే ఉందని పేర్కొన్నారు. దేశీయ ఐటీ రంగం రూపాయిల్లో 10 శాతం వృద్ధి సాధించిందని, డాలర్ బలహీనపడిన కారణంగానే ఈ వృద్ధి సాధ్యమైందని తెలిపారు. కానీ డాలర్ల పరంగా వృద్ధి నామమాత్రమేనని , ఇది ఆందోళన కలిగిస్తోందని వివరించారు.

 వచ్చే ఏడాది బావుంటుంది
 ఇతర దేశాల్లో భారత ఐటీ రంగం అద్భుతాలు సృష్టిస్తోందని, ఉత్పాదకతను పెంచుతోందని పేర్కొన్నారు. కానీ, దేశీయంగా చూస్తే ఐటీ సేవల వినియోగం స్వల్పంగానే ఉందని తెలిపారు.  మొత్తం భారత ఐటీ పరిశ్రమలో దేశీయ మార్కెట్ వాటా 10 శాతమే అయినప్పటికీ, దేశీయ మార్కెట్లో ఐటీ వృద్ధి తీరు ఆందోళనకరంగానే ఉందని వివరించారు. భారత-ఐటీ బీపీఎం పరిశ్రమ ఎగుమతి ఆదాయం 13 శాతం వృద్ధితో గత ఆర్థిక సంవత్సరంలో 8,600 కోట్ల డాలర్లకు చేరగా,  దేశీయ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.1.15 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 13-15 శాతం, దేశీయ మార్కెట్ 9-12 శాతం చొప్పున వృద్ధి సాధిస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అన్నీ కుదురుకోవడానికి ఆరు నెలలు పడుతుందని చంద్రశేఖర్ వివరించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే తగిన సూచనలందిస్తామని పేర్కొన్నారు. కొన్ని సరైన నిర్ణయాలు జరిగే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది పెద్ద మార్పులేమీ లేనప్పటికీ, వచ్చే ఏడాది బావుంటుందని చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement