రెండింతలు పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు | Sakshi
Sakshi News home page

రెండింతలు పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు

Published Tue, Aug 1 2017 8:18 AM

రెండింతలు పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు

న్యూఢిల్లీ : ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు ప్రతినెలా రెండింతలు పెరుగుతున్నాయి. ఇలా వచ్చే ఏడాది మార్చి వరకు అంటే సబ్సిడీలను ముగించేవరకు సిలిండర్‌ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్‌పై ఇస్తున్న రూ.87 సబ్సిడీని  ప్రభుత్వం పూర్తిగా తీసివేయాలని చూస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం చాలా ఇంధనాలపై ఉన్న ధరల నియంత్రణను తొలగించింది. దీంతో ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
 
వంటగ్యాస్‌ విషయంలో ప్రభుత్వం అంతకముందే 'గివ్‌ ఇట్‌ అప్‌' క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. అంతేకాక ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ కంపెనీలు ప్రతి నెలా సబ్సిడీ సిలిండర్‌పై నెలకు 2 రూపాయలను పెంచుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ పెంపు రెండింతలు అయింది. మరోసారి అధికారిక ఓఎంసీలకు సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దీంతో జూన్‌ 1 నుంచి ప్రతినెలా నెలకు ఒక్కో సిలిండర్‌పై 4 రూపాయలు పెరుగనున్నట్టు ఇంధన మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ తెలిపారు. ఈ పెంపు ప్రభుత్వం సబ్సిడీని పూర్తిగా నిర్మూలించేవరకు లేదా 2018 మార్చి వరకు లేదా మరిన్ని ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పారు.
   
జూలై 1 వరకు భారత్‌లో 18.12 కోట్ల సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ కస్టమర్లున్నారు. దానిలో 2.5 కోట్ల మంది పేదరిక మహిళలే. గతేడాది నుంచి ప్రధాన్‌ మంత్రి ఉజ్వల యోజన కింద వీరు కనెక్షన్‌ పొందారు. నాన్‌-సబ్సిడీ కస్టమర్లు 2.66 కోట్ల మంది ఉన్నారు. ఎల్‌పీజీ ధరలను నెలవారీ పద్దతిన సవరిస్తున్నామని ఇంధన మంత్రి చెప్పారు. ఎల్‌పీజీపై ఇచ్చే సబ్సిడీని కూడా రిటైల్‌ సెల్లింగ్‌ ధరపై మార్కెట్‌ టూ మార్కెట్‌ ఆధారితంగా నిర్ణయిస్తున్నామని పేర్కొన్నారు. 2017 జూలై వరకు 14.2 కేజీల సిలిండర్‌పై సబ్సిడీ ఢిల్లీలో రూ.86.54గా ఉంది. ప్రతినెలా సబ్సిడీ ధరలపై 4 రూపాయలను పెంచితే, మార్చి వరకు మొత్తం సబ్సిడీలను నిర్మూలించవచ్చని ప్రభుత్వ రంగ ఓఎంసీకి చెందిన ఓ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. 

Advertisement
Advertisement