మౌలిక వసతుల్లో ఏపీ వెనుకంజ | Sakshi
Sakshi News home page

మౌలిక వసతుల్లో ఏపీ వెనుకంజ

Published Wed, Jan 21 2015 2:32 AM

మౌలిక వసతుల్లో ఏపీ వెనుకంజ

అనుమతుల మంజూరులో జాప్యం వల్లే పెట్టుబడులు రావట్లేదు
అభివృద్ధి ఏ ప్రాంతంలో జరుగుతుందో క్లారిటీ లేదు
మాలక్ష్మి గ్రూప్ చైర్మన్ హరీష్ చంద్రప్రసాద్ వ్యాఖ్యలు
విజయవాడలో సెంటోజా పేరిట హౌసింగ్ ప్రాజెక్టు ప్రకటన
25న శంకుస్థాపన; ఏ ప్రాజెక్టుకైనా ఇక అదే పేరు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గుజరాత్, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలతో పోలిస్తే మౌలిక వసతుల్లోను, త్వరితగతిన అనుమతులివ్వటంలోను ఆంధ్రప్రదేశ్ కాస్త వెనకబడే ఉందని, అందుకే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో పరిశ్రమలను ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చిన కంపెనీలు ఇపుడు ఆలోచనల్లో పడ్డాయని మాలక్ష్మి గ్రూప్ చైర్మన్ వై.హరీష్ చంద్ర ప్రసాద్ చెప్పారు.

రాష్ట్రం ఏర్పడి ఏడు నెలలవుతున్నా రాజకీయంగా స్థిరపడకపోవటం, రాజధాని నిర్మాణానికి నిధుల లేమి, మౌలిక వసతుల్లో వెనకబాటు తనం వల్లే ఏపీలో అభివృద్ధికి ఇంకా శంకుస్థాపన జరగట్లేదని అభిప్రాయపడ్డారు. మాలక్ష్మీ ప్రాపర్టీ వెంచర్స్ తరఫున ఏపీలో తొలి ప్రాజెక్టుకు ఈ నెల 25న విజయవాడలో శంకుస్థాపన చేయనున్న సందర్భంగా మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ‘రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్’ అనే అంశంపై ఆయన తన అభిప్రాయాలు వ్యక్తంచేశారు. ఆయనేమన్నారంటే...
     
ఆరేడు నెలలుగా ఏపీలో స్థిరాస్తి అమ్మకాలు పూర్తిగా మందగించాయి. జరుగుతున్నవల్లా డెవలప్‌మెంట్ ఒప్పందాలే. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నిడమానూరులో మా సంస్థకున్న భూమి విలువ ఎకరం రూ.15 కోట్లు పలికింది. కానీ, ఇప్పుడు సగానికి విక్రయిస్తామన్నా కొనేవారు లేరు. కావాలంటే డెవలప్‌మెంట్‌కు ఇవ్వండని అడుగుతున్నారు.

ఇందుకు ప్రధాన కారణమేంటంటే... కొత్త రాజధానిగా ప్రకటించిన తుళ్లూరు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందా? లేక క్యాపిటల్ రీజియన్ అథారిటీగా ప్రకటించిన ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందా? అనే విషయంపై ఇంకా పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు క్లారిటీ రాలేదు. అందుకే ఏపీకి ఇంకా పెట్టుబడులు రావట్లేదు. ఆయా అంశాలపై స్పష్టత తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తోంది. ప్లాన్ వస్తేగానీ ఎక్కడ ఎంత విస్తీర్ణంలో అభివృద్ధి జరుగుతుందో తెలియదు.
     
విజయవాడ, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాలక్ష్మి గ్రూప్‌కు 250 ఎకరాలున్నాయి. వీటిల్లో 100 ఫేజుల్లో 100 అపార్ట్‌మెంట్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఒక్కో అపార్ట్‌మెంట్‌పై రూ.100 కోట్లు పెట్టుబడిగా పెడతాం. ఫేజ్-1లో నిడమానూరులో 2.3 ఎకరాల్లో ‘సెంటోజా’ పేరుతో నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నాం. ఈనెల 25న ప్రారంభించనున్న ఈ ప్రాజెక్ట్‌ను 18 నెలల్లో పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలిస్తాం.

ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో మాలక్ష్మి గ్రూప్ నిర్మించే ఏ నివాస సముదాయాన్నైనా సెంటోజా పేరుతోనే నిర్మిస్తాం. - సమైక్య ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నపుడు చాలా మంది కవులు, రచయితలు, కళాకారులు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడి పోయారు. ఇపుడు వారికి పునఃస్వాగతం పలుకుతూనే.. కొత్త వారిని ప్రోత్సహించాలి. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో సాంస్కృతిక పునరుజ్జీవనం చేసేందుకు విజయవాడలో కల్చరల్ సెంటర్‌ను నిర్మిస్తాం.
     
పారిశ్రామికవేత్తలు స్థానికంగా ఉన్న కళారూపాల్ని, గ్రామాల్ని దత్తత తీసుకొని అభివృద్ధి పరచాలి. అప్పుడే ఆ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. అందుకే విజయవాడలో కొండపల్లి బొమ్మలను తయారుచేసే 116 కళాకారులను దత్తత తీసుకున్నాం.  మా స్వస్థలమైన కృష్ణా జిల్లాలోని పెదమద్దాలి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా.

Advertisement
Advertisement