ఆగస్ట్‌లో పెరిగిన ట్రాక్టర్ల అమ్మకాలు | Sakshi
Sakshi News home page

ఆగస్ట్‌లో పెరిగిన ట్రాక్టర్ల అమ్మకాలు

Published Tue, Sep 4 2018 1:34 AM

Mahindra and Mahindra reports 7% increase in tractor sales - Sakshi

న్యూఢిల్లీ/ముంబై: ఖరీఫ్‌ సీజన్‌ కావడంతో ట్రాక్టర్ల విక్రయాలకు కలిసొచ్చింది. ఆగస్ట్‌ మాసంలో ట్రాక్టర్ల అమ్మకాల్లో మంచి వృద్ధి నెలకొంది. ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ (ఐటీఎల్‌)కు చెందిన సోనాలికా ట్రాక్టర్ల విక్రయాలు ఏకంగా 23.2 శాతం పెరిగాయి. 7,369 వాహనాలను విక్రయించింది. ఎగుమతులతో కలిపి 2017 ఆగస్ట్‌లో అమ్ముడుపోయిన ట్రాక్టర్లు 6,036 మాత్రమే. దీంతో పోలిస్తే విక్రయాలు 23.2 శాతం పెరిగాయి.

ఈ కంపెనీ ట్రాక్టర్ల ఎగుమతులు క్రితం ఏడాది ఆగస్ట్‌లో 1,095గా ఉంటే, ఈ ఏడాది ఆగస్ట్‌లో 2,082కు పెరగడం గమనార్హం. ఈ సంస్థ 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. అటు మహింద్రా అండ్‌ మహింద్రా ట్రాక్టర్ల విక్రయాలు ఆగస్ట్‌ నెలలో 7 శాతం వృద్ధి చెంది 17,785 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ అమ్మకాలు 16,375 యూనిట్లు కావడం గమనార్హం. క్రితం ఏడాది ఆగస్ట్‌ నెలలో 16,641 ట్రాక్టర్లు అమ్ముడుపోయాయి. ఎగుమతి అయిన వాహనాల సంఖ్య 1,285 యూనిట్ల నుంచి 1,410 యూనిట్లకు పెరిగింది.  

బజాజ్‌ ఆటోఅమ్మకాల్లో వృద్ధి
బజాజ్‌ ఆటో అమ్మకాలు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అన్ని విభాగాల్లో అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయి. ఆగస్ట్‌ నెలలో 4,37,092 యూనిట్లను కంపెనీ విక్రయించింది. క్రితం ఏడాది ఇదే నెలలో విక్రయాలు 3,35,031 యూనిట్లుగా ఉండడం గమనార్హం.

దేశీయ అమ్మకాలు 27 శాతం వృద్ధితో 2,00,659 యూనిట్ల నుంచి 2,55,631 యూనిట్లకు పెరిగాయి. మొత్తం మోటారు సైకిళ్ల అమ్మకాలు 3,62,923 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో ఉన్న అమ్మకాలతో పోల్చి చూస్తే 28 శాతం పెరిగాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 51,170 యూనిట్ల నుంచి 74,169 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతులు సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 1,34,372 యూనిట్ల నుంచి 1,81,461 యూనిట్లకు వృద్ధి చెందాయి.   

Advertisement
Advertisement