పిల్లల కోసం ఎంతైనా వెచ్చిస్తారు.. | Sakshi
Sakshi News home page

పిల్లల కోసం ఎంతైనా వెచ్చిస్తారు..

Published Fri, Jan 22 2016 2:37 AM

పిల్లల కోసం ఎంతైనా వెచ్చిస్తారు..

మహీంద్రా రిటైల్ సీఈవో ప్రకాశ్ వాకంకర్
ఉత్పత్తులు అత్యుత్తమమైతే చాలు
చిన్న నగరాలకూ బేబీఓయ్ స్టోర్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పిల్లల కోసం అత్యుత్తమ ఉత్పత్తులు కొనేందుకు తల్లిదండ్రులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకు డబ్బులు ఎంతైనా సరే వెచ్చిస్తారని అంటున్నారు మహీంద్రా రిటైల్ సీఈవో ప్రకాశ్ వాకంకర్. ఇప్పుడు ఈ ట్రెండ్ చిన్న నగరాలకూ పాకిందని చెప్పారాయన. బేబీ, మదర్ కేర్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు బేబీ ఓయ్ స్టోర్లను విస్తరిస్తున్నట్టు తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ బ్రాండ్ కార్టర్ ఉత్పత్తులను సైతం భారతీయ కస్టమర్లకు చేరువ చేశామన్నారు. మామ్ అండ్ మీ నుంచి బేబీఓయ్‌గా మారిన బ్రాండ్ విస్తరణతోపాటు పరిశ్రమ తీరుతెన్నుల గురించి ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. విశేషాలు ఇవీ..

బేబీఓయ్‌గా పేరు మార్పు ప్రభావం ఎలా ఉంది?
మహీంద్రా రిటైల్ బేబీ, మదర్‌కేర్ ఉత్పత్తుల విక్రయానికి మామ్ అండ్ మీ బ్రాండ్ పేరుతో 2009 నుంచి స్టోర్లను నిర్వహిస్తోంది. ఇదే రంగంలో ఉన్న బేబీఓయ్.కామ్‌ను 2014 చివర్లో కొనుగోలు చేసింది. బేబీఓయ్ పేరు యువతను బాగా ఆకట్టుకుంది. దీంతో మామ్ అండ్ మీ స్టోర్ల పేర్లను బేబీఓయ్‌గా మార్చాం. 52 నగరాలకుగాను ప్రస్తుతం 75 స్టోర్లను కంపెనీ సొంతంగా, ఫ్రాంచైజీలు 35 స్టోర్లను నిర్వహిస్తున్నారు. మార్చికల్లా మరో 15 స్టోర్లు, 2016-17లో 40 ఔట్‌లెట్లను ప్రారంభిస్తాం. కాకినాడ, గుంటూరు వంటి నగరాల్లోనూ దుకాణాలను తెరిచాం. ఆసుపత్రుల్లోనూ ఔట్‌లెట్లను నెలకొల్పుతున్నాం. ప్రొడక్టుల విక్రయంలో ఫ్రాంచైజీలకు పూర్తి స్వేచ్ఛ ఉంది.

 మీ ఉత్పత్తుల ప్రత్యేకత ఏమిటి?
పిల్లలకు ఏం జరిగినా దాని ప్రభావం అంతా ఇంతా కాదు. అందుకే నాణ్యత, భద్రత కు పెద్దపీట వేస్తున్నాం. ఉత్పత్తుల అభివృద్ధి, నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక బృందం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి తయారైన ఉత్పత్తులనే వెండార్ల నుంచి సేకరిస్తున్నాం. కేవలం బేబీఓయ్‌లో మాత్రమే లభించే ప్రొడక్టులూ ఉన్నాయి. ఇక ధర అంటారా అంతర్జాతీయ బ్రాండ్లతో పోలిస్తే సగానికంటే తక్కువగా ఉంటాయి. ఫ్రాంచైజీలు, వినియోగదార్ల సూచనల ఆధారంగా చేసుకుని ప్రొడక్టులను ప్రవేశపెడుతున్నాం. మధురైకి చెందిన ఒక ఫ్రాంచైజీ ఇచ్చిన సూచనతో మస్కిటో రెపెల్లెంట్‌ను ప్రవేశపెట్టాం. మొత్తంగా 6,000పైగా ప్రొడక్టులు స్టోర్స్‌లో కొలువుదీరాయి.

 సొంతగా తయారీపై దృష్టిపెట్టారా?
మొత్తం 11 విభాగాల్లో 55 బ్రాండ్ల ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. కంపెనీ అమ్మకాల్లో ప్రైవేట్ లేబుల్ వాటా అపారెల్‌లో 43 శాతం, మిగిలిన ఉత్పత్తుల్లో 15% ఉంది. చైనా, ఫ్రాన్స్, ఇటలీ నుంచి ఉత్పత్తులను సేకరిస్తున్నాం. స్టోలర్, కాట్ సీట్స్, జీప్స్, టాయ్స్ వంటి ఉత్పత్తులు భారత్‌లో తయారు అవడం లేదు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు సీరియస్‌గా ఈ రంగంలో దిగితే చైనా కంటే తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయవచ్చు. భారత్‌లో తయారీని ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఉన్నాం. సొంతంగా రంగంలోకి దిగడమా లేదా వెండార్లకు తోడ్పాటు అందించడమా అన్నది త్వరలో వెల్లడిస్తాం.

 బేబీ, మదర్‌కేర్ ఉత్పత్తులకు డిమాండ్ ఎలా ఉంది?
భారత్‌లో బేబీ, మదర్‌కేర్ ఉత్పత్తుల పరిశ్రమ 28% వార్షిక వృద్ధితో సుమారు రూ.50,000 కోట్లుంది. వ్యవస్థీకృత రంగంలో బేబీఓయ్‌తోపాటు దాదాపు 10 బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఏటా 2.7 కోట్ల జననాలు నమోదవుతున్నాయి. యువ మాతృమూర్తులు తమతోపాటు పిల్లల సౌకర్యాన్ని కోరుకుంటున్నారు. ఈ రంగ కంపెనీలకు కలిసి వచ్చే అంశాలివే. వాస్తవానికి చిన్ననగరాల్లో డిమాండ్ విపరీతంగా ఉన్నా ఆ స్థాయిలో స్టోర్ల విస్తరణ జరగలేదు. ఆన్‌లైన్ కంపెనీల మూలంగా పరిశ్రమకు ఒత్తిడి ఉన్న మాట వాస్తవం. ఇక అపారెల్, టాయ్స్ విషయంలో కొనుగోలు నిర్ణయం మహిళలదే. అదే ఖరీదైన స్టోలర్ వంటి ఉత్పత్తులైతే పురుషులదే తుది నిర్ణయం. కంపెనీ విక్రయాల్లో ఆన్‌లైన్ వాటా 15-17%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బేబీఓయ్ 20 శాతంపైగా వృద్ధి నమోదు చేస్తుందని అంచనా.

Advertisement
Advertisement