Sakshi News home page

మందగించిన కీలక రంగాలు

Published Wed, May 2 2018 12:42 AM

In March the growth rate was 4.1 per cent - Sakshi

న్యూఢిల్లీ: బొగ్గు, ముడిచమురు తదితర పరిశ్రమల పనితీరు బలహీనంగా ఉండటంతో మార్చిలో ఎనిమిది కీలక రంగాల వృద్ధి రేటు 4.1 శాతానికి తగ్గింది. ఇది మూడు నెలల కనిష్టం. చివరిసారిగా 2017 డిసెంబర్‌లో వృద్ధి కనిష్ట స్థాయిలో 3.8 శాతంగా నమోదైంది. గతేడాది మార్చిలో కీలక రంగాల వృద్ధి రేటు 5.2 శాతం. తాజాగా బొగ్గు, క్రూడాయిల్‌తో పాటు సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, విద్యుత్‌ విభాగాల వృద్ధి కూడా నెమ్మదించింది.

మరోవైపు 2017–18 పూర్తి ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎనిమిది కీలక రంగాల వృద్ధి రేటు 4.2%కి పరిమితమైంది. ఇది గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనిష్టం కావడం గమనార్హం. 2015–16లో ఇది 3% కాగా, 2016–17లో 4.8 శాతం. కీలకమైన ఈ రంగాల వాటా పారిశ్రామికోత్పత్తి సూచీలో 41% దాకా ఉంటుంది. కాబట్టి ఇవి పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైనా ప్రభావం చూపుతాయి.

♦ మార్చిలో ఎరువులు, సిమెంటు రంగాలు మాత్రమే మెరుగైన పనితీరు కనపర్చాయి. ఎరువులు 3.2 శాతం, సిమెంటు రంగం 13 శాతం వృద్ధి రేటు నమోదు చేశాయి.
♦ బొగ్గు విభాగం వృద్ధి రేటు 9.1 శాతం (2017 మార్చిలో ఇది 10.6 శాతం). సహజ వాయువు 1.3 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 1 శాతం, ఉక్కు ఉత్పత్తి 4.7 శాతానికి పరిమితమయ్యాయి. విద్యుదుత్పత్తి కూడా 6.2 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. ముడిచమురు విభాగం 1.6 శాతం ప్రతికూల వృద్ధి రేటు నమోదు చేసింది. 

Advertisement
Advertisement