రికార్డు స్థాయిలో ముగింపు | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో ముగింపు

Published Tue, May 16 2017 2:21 AM

రికార్డు స్థాయిలో ముగింపు - Sakshi

ద్రవ్యోల్బణం తగ్గడంతో కొనుగోళ్ల జోరు
సెన్సెక్స్‌ 134 పాయింట్లు, నిఫ్టీ 44 పాయింట్లు అప్‌

ముంబై: ద్రవ్యోల్బణం తగ్గిందన్న వార్తలతో సోమవారం దేశీయ స్టాక్‌ సూచీలు కొత్త రికార్డుస్థాయిలో ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 134 పాయింట్లు ఎగిసి 30,322 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 44 పాయింట్లు ర్యాలీ జరిపి 9,445 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచీలు రెండూ గత గురువారంనాటి చరిత్రాత్మక గరిష్టస్థాయిల్ని (సెన్సెక్స్‌ 30,366, నిఫ్టీ 9,450) అధిగమించలేకపోయినా, అయితే ఆ రోజుకంటే అధికస్థాయిలో ముగిసి కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి.

తాజాగా సెన్సెక్స్‌ 30,357 పాయింట్లు, నిఫ్టీ 9,447 పాయింట్ల గరిష్టస్థాయిల్ని నమోదుచేసి, ముగింపులో స్వల్పంగా తగ్గాయి. ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్‌కావడం, డాలరుతో రూపాయి మారకపు విలువ జోరుగా పెరగడం కూడా ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

టాటా స్టీల్‌ జూమ్‌..: మంగళవారం ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్న టాటా స్టీల్‌...సెన్సెక్స్‌ షేర్లలో అత్యధికంగా 4.35 శాతం పెరిగి రూ. 454 వద్ద ముగిసింది. లాభాలు మూడింతలైనట్లు గత శుక్రవారం ఫలితాల్ని ప్రకటించిన డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ షేరు 3.54 శాతం ఎగిసి రూ. 2,665 వద్దకు చేరింది .ఎగిసిన ఎరువుల కంపెనీల షేర్లు...: ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు బావుంటాయన్న అంచనాలు వెలువడటంతో ఎరువుల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు జరిగాయి.

 

Advertisement
Advertisement