మారుతీ కొత్త బాలెనో వస్తోంది.. | Sakshi
Sakshi News home page

మారుతీ కొత్త బాలెనో వస్తోంది..

Published Wed, Sep 16 2015 2:52 AM

మారుతీ కొత్త బాలెనో వస్తోంది..

 ఫ్రాంక్‌ఫర్ట్ : మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బాక్ కేటగిరీలో కొత్త కారు మోడల్‌ను ఈ పండుగల సీజన్‌లో మార్కెట్లోకి తెస్తోంది. బాలెనో పేరుతో పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కారును మారుతీ కంపెనీ అందించనున్నది. మారుతీ మాతృకంపెనీ సుజుకీ మోటార్ కార్ప్ ఈ కొత్త బాలెనో మోడల్‌ను ఇక్కడ జరుగుతున్న ఆటో షోలో ప్రదర్శించింది. ప్రీమియం  కార్ల విక్రయాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నెక్సా అవుట్‌లెట్ల ద్వారా ఈ బాలెనో కార్లను విక్రయిస్తామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. పెట్రోల్ వేరియంట్‌ను 1.2 లీటర్ ఇంజిన్‌తోనూ, డీజిల్ వేరియంట్‌ను 1.3 లీటర్ ఇంజిన్‌తోనూ అందిస్తామని తెలిపారు.  ఫ్రాంక్‌ఫర్ట్ ఆటోషో గురువారం లాంఛనంగా ప్రారంభమై ఈ నెల 27వరకూ కొనసాగుతుంది. మంగళ, బుధవారాల్లో  కేవలం మీడియాను మాత్రమే అనుమతిస్తారు. ఇతర వివరాలు..

 రోల్స్ రాయిస్ నుంచి కొత్త డాన్..
 ఇంగ్లాండ్‌కు చెందిన సూపర్ లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ కొత్త ఓపెన్-టాప్ మోడల్ కారును ఈ ఆటో షోలో ప్రదర్శించింది. డాన్ పేరుతో అందిస్తున్న ఈ కారును వచ్చే ఏడాది జూలైకల్లా భారత మార్కెట్లోకి తెస్తామని రోల్స్-రాయిస్ మోటార్ కార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టొరస్టన్ ముల్లర్ ఒట్‌వోస్ చెప్పారు. త్వరలో కొత్త కన్వర్టిబుల్‌ను. ఒక ఎస్‌యూవీని కూడా భారత మార్కెట్లోకి తేనున్నామని వివరించారు. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ కంపెనీ సొంతమైన రోల్స్-రాయిస్ భారత్‌లో రూ.4.6 కోట్ల నుంచి రూ.9 కోట్ల విలువైన లగ్జరీ కార్లను విక్రయిస్తోంది.  

 ఎస్‌యూవీ మార్కెట్లోకి టాటా జేఎల్‌ఆర్
 టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) సంస్థ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్‌యూవీ) మార్కెట్లోకి ప్రవేశించింది. ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో ఎఫ్-పేస్ ఎస్‌యూవీని ప్రదర్శించింది. ఈ ఎస్‌యూవీని వచ్చే ఏడాది మొదట్లో అమెరికా, యూరప్‌ల్లో,  వచ్చే ఏడాది రెండో అర్థభాగంలో భారత మార్కెట్లోకి తెస్తామని జేఎల్‌ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి చెప్పారు.

 వచ్చే ఏడాది ఫోక్స్‌వ్యాగన్ కొత్త టైగువాన్ ఎస్‌యూవీ
 జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ ఎస్‌యూవీ టైగువాన్‌లో కొత్త జనరేషన్ కారును వచ్చే ఏడాది భారత్‌లోకి అందుబాటులోకి తేనున్నది. గోల్ఫ్, పోలో కార్ల తర్వాత అంత్యంత పాపులర్ అయిన కారు ఇదేనని కంపెనీ సీఈఓ హెర్బర్ట్  డిఈస్ పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement