మారుతీ లాభం జూమ్‌.. | Sakshi
Sakshi News home page

మారుతీ లాభం జూమ్‌..

Published Thu, Jan 26 2017 1:27 AM

మారుతీ లాభం జూమ్‌..

క్యూ3లో రూ.1,745 కోట్లు; 47 శాతం వృద్ధి...
నోట్ల రద్దుతో తగ్గిన చిన్న కార్ల విక్రయాలు

న్యూఢిల్లీ: మారతీ సుజుకీ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,745 కోట్ల నికర లాభం (స్టాండెలోన్‌) సాధించింది. గత క్యూ3లో సాధించిన నికర లాభం(రూ.1,183 కోట్లు)తో పోల్చితే 47 శాతం వృద్ధి సాధించామని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.16,958 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.19,173 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఎఫ్‌ఓ అజయ్‌ సేథ్‌ చెప్పారు. వాహన విక్రయాలు  4 శాతం వృద్ధితో 3,87,251కు చేరాయని వివరించారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా మినీ, కాంపాక్ట్‌  సెగ్మెంట్ల కార్ల విక్రయాలు కుదేలయ్యాయని, అందుకే వాహన విక్రయాలు స్వల్ప స్థాయిలోనే పెరిగాయని వివరించారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో కంపెనీ వాహన విక్రయాలు 18 శాతం వృద్ధి చెందాయి.

ఇబిటా 16 శాతం అప్‌..
ఇతర ఆదాయం 144% పెరిగి రూ.592 కోట్లకు చేరడం కలసివచ్చిందని అజయ్‌ సేథ్‌ చెప్పారు. ప్రీమియమ్‌ కార్ల విక్రయాలు పెరగడం, అమ్మకాల, మార్కెటింగ్‌ వ్యయాలు తక్కువగా ఉండడం, వ్యయ నియంత్రణ ప్రయత్నాలు నిర్వహణేతర వ్యయం తక్కువగా ఉండడంతో లాభాలు పెరిగాయని వివరించారు. దీంతో  కమోడిటీ ధరలు పెరిగినా, విదేశీ మారక ద్రవ్య సంబంధిత ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోగలిగామన్నారు. ఇబిటా 16% వృద్ధితో   రూ.2,489 కోట్లకు పెరిగిందని, మార్జిన్‌ 50 బేసిస్‌ పాయింట్లు పెరిగి(క్వార్టర్‌  ఆన్‌ క్వార్టర్‌  ప్రాతిపదికన 230 బేసిస్‌ పాయింట్లు తగ్గి)  15%కి చేరిందని తెలిపారు. ముడి పదార్ధాల ధరలు పెరగడం వల్ల క్యూ2తో పోల్చితే మార్జిన్‌ తగ్గిందని వివరించారు.

విటారా బ్రెజాకు మంచి స్పందన..
కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విటారా బ్రెజా అమ్మకాలు బాగా పెరిగాయని  అజయ్‌ సేథ్‌ చెప్పారు. గత క్యూ3లో 18 శాతంగా ఉన్న యుటిలిటి వెహికల్‌ సెగ్మెంట్లో తమ మార్కెట్‌ వాటా ఈ క్యూ3లో 28 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.21,997గా  ఉన్న ఒక్కొక్క కారుపై డిస్కౌంట్‌ ఈ క్యూ3లో 19,040కు తగ్గిందని వివరించారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రకటించిన నవంబర్‌లో ఎంక్వ యిరీలు, బుకింగ్‌లు తగ్గాయని, డిసెంబర్, జనవరిల్లో క్రమంగా పుంజుకున్నాయని తెలిపారు.
ఫలితాల నేపథ్యలో బీఎస్‌ఈలో మారుతీ సుజుకీ షేర్‌ 1% లాభపడి రూ.5,797 వద్ద ముగిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement