మాల్యా పాస్ పోర్ట్ సస్పెన్షన్ | Sakshi
Sakshi News home page

మాల్యా పాస్ పోర్ట్ సస్పెన్షన్

Published Fri, Apr 15 2016 11:46 PM

మాల్యా పాస్ పోర్ట్ సస్పెన్షన్ - Sakshi

ఈడీ విజ్ఞప్తి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
నాలుగు వారాలు అమలు
వారంలో స్పందన లేకపోతే రద్దు!

 న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సిఫారసులకు అనుగుణంగా భారత విదేశాంగశాఖ  ‘ఉద్దేశ్యపూర్వక బ్యాంకింగ్ రుణ ఎగవేతదారు’ విజయ్‌మాల్యాపై కఠిన చర్యలకు శుక్రవారం శ్రీకారం చుట్టింది. ఆయన డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను నాలుగువారాలు సస్పెండ్ చేసింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నట్లు భావిస్తున్న మాల్యా, భారత్‌కు తిరిగి వచ్చే అంశం, అలాగే పాస్‌పోర్ట్‌ను ఎందుకు రద్దు చేయకూడదన్న అంశంపై వారంలోపు స్పందించకపోతే... పాస్‌పోర్ట్ రద్దు చేస్తామని కేంద్రం సూచన ప్రాయంగా హెచ్చరించింది. రూ.900 కోట్ల ఐడీబీఐ బ్యాంక్ రుణ మోసపూరిత వ్యవహారంపై...

ముంబైలోని జోనల్ కార్యాలయంలో పీఎంఎల్‌ఐ (అక్రమ ధనార్జనా చట్టం) కింద జరుగుతున్న క్రిమినల్ కేసుల విచారణలో ఏ మాత్రం సహకరించడంలేదని పేర్కొంటూ... మాల్యా రెగ్యులర్,  డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ఈడీ మూడు రోజుల క్రితం విజ్ఞప్తి చేసింది.  రాజ్యసభ సభ్యునిగా  జారీ చేసిన డిపమాటిక్ పాస్‌పోర్ట్‌ను వినియోగించుకుని ఆయన మార్చి 2న బ్రిటన్‌కు వెళ్లినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం... డిప్లమాటిక్ పాస్‌పోర్ట్ జారీ సందర్భంలో సంబంధిత వ్యక్తి రెగ్యులర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ డాక్యుమెంట్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిప్లమాటిక్ పాస్‌పోర్ట్ రద్దయితే...  రెగ్యులర్ పాస్‌పోర్ట్ రద్దుకూ అది దారితీస్తుంది. తాజా ఈడీ చర్య నేపథ్యంలో... మాల్యా మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతున్నట్లు కనబడుతోంది.

 అరెస్టు వారెంట్ జారీ కోరిన ఈడీ...
మాల్యా పాస్‌పోర్ట్ రద్దయితే... ఈ విషయాన్ని  విదేశాంగ మంత్రిత్వశాఖ బ్రిటన్ అధికారులకు తెలియజేస్తుంది. అలాగే మాల్యాను దేశానికి పంపాలని కోరుతుంది.  ప్రపంచంలో ఎక్కడున్నా... పట్టుకోడానికి రెడ్ కార్నర్ నోటీసునూ జారీ చేసే వెసులుబాటు లభిస్తుంది. పాస్‌పోర్ట్‌ను నిలిపివేసిన వెంటనే... నేర విచారణ ప్రక్రియలో తనకు లభిం చిన ఒక అవకాశాన్ని శుక్రవారం వెన్వెంటనే ఈడీ అమలు చేయడం మరో విశేషం. ఐడీబీఐ రుణ అవకతవకల కేసులో మాల్యా అరెస్టుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ ముంబైలోని  పీఎంఎల్‌ఐ కోర్టును ఈడీ ఆశ్రయించింది. ఈ  పిటిషన్‌పై శనివారం విచారణ జరిగే అవకాశం ఉందని ఈడీ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement
Advertisement