దోషిగా తేల్చేవరకూ నిరపరాధినే: మాల్యా | Sakshi
Sakshi News home page

దోషిగా తేల్చేవరకూ నిరపరాధినే: మాల్యా

Published Sat, Jan 28 2017 1:15 AM

దోషిగా తేల్చేవరకూ నిరపరాధినే: మాల్యా

న్యూఢిల్లీ: అక్రమంగా నిధుల తరలింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత విజయ్‌ మాల్యా మరోసారి తాను అమాయకుడినని చెప్పుకొచ్చారు. బ్యాంకులకు రూ.9వేల కోట్లకుపైగా రుణాలు ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న ఆయన ట్వీటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ఈ నిమిషం వరకు బ్యాంకులకు కేఎఫ్‌ఏ (కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌) బకాయి పడిన విషయంలో న్యాయపరంగా ఎటువంటి తుది నిర్ణయం రాలేదు. వ్యక్తిగత హోదాలో నేను ఎంత రుణపడి ఉన్నానన్నది విచారణ తర్వాత తెలుస్తుంది’’ అంటూ మాల్యా ట్వీట్‌ చేశారు. శుక్రవారం వరుసపెట్టి ట్వీట్లు చేసిన ఆయన ఇటీవలి పరిణామాలను మీడియా చిత్రీకరించిన తీరు పట్ల మండిపడ్డారు.

‘‘మన దేశంలో దోషిగా ప్రకటించే వరకు అమాయకుడిగానే పరిగణిస్తారు. కానీ, ఎటువంటి విచారణ లేకుండానే వివిధ రకాల ప్రభావాలకు లోనై మీడియా నన్ను దోషిగా ప్రకటించేసింది’’ అంటూ మాల్యా ట్వీట్‌ చేశారు. కోర్టు తనను దోషిగా తేల్చే వరకు అమాయకుడినేనన్నారు. ‘‘బ్యాంకులకు  బకాయి పడి విదేశాలకు పారిపోయానని అంటున్నారు. కానీ వ్యక్తిగతంగా నేనెప్పుడూ రుణాలు తీసుకోలేదు’’ అని మాల్యా పేర్కొన్నారు. యునైటెడ్‌ స్పిరిట్స్‌ నుంచి నిధుల మళ్లింపు కేసులో మాల్యా, మరో ఆరుగురిని సెబీ నిషేధించడం తెలిసిందే.

Advertisement
Advertisement