ఆఫీస్ 365కి 2.5 కోట్ల యూజర్లు | Sakshi
Sakshi News home page

ఆఫీస్ 365కి 2.5 కోట్ల యూజర్లు

Published Wed, May 7 2014 1:47 AM

ఆఫీస్ 365కి 2.5 కోట్ల యూజర్లు

 భారత్‌లో మైక్రోసాఫ్ట్ లక్ష్యమిది
 
 న్యూఢిల్లీ: క్లౌడ్ ఆధారిత ‘ఆఫీస్ 365 పర్సనల్’ భారత్‌లో 2.5 కోట్ల మంది వినియోగదార్లకు అందించడంపై దృష్టిపెట్టినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ తదితర అప్లికేషన్లను ఉపయోగించేందుకు వీలుకల్పించే ఈ సాఫ్ట్‌వేర్‌కు వినియోగానికిగాను నెలకు రూ.330 చొప్పున చార్జీని వసూలు చేయనుంది. ‘చౌక సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌తో లభించే ఈ ఆఫీస్ సూట్‌ను విండోస్/మ్యాక్ పీసీలలో వాడుకోవచ్చు. కాగా, మొబైల్ వెర్షన్స్(ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్‌లలో)కు ఏడాదికి రూ.3,299 చొప్పున ఫీజు ఉంటుంది. రాబోయే ఏడాది కాలంలో భారత్‌లో ఈ సేవలకు 2.5 కోట్ల మంది యూజర్లను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

ప్రధానంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదార్ల నుంచి అధిక సబ్‌స్క్రిప్షన్ లభిస్తుందని భావిస్తున్నాం’ అని మైక్రోసాఫ్ట్ కంట్రీ జనరల్ మేనేజర్(కన్సూమర్ చానల్స్ విభాగం) చక్రపాణి గొల్లపల్లి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి సాధించిన ప్రొడక్ట్‌గా ఈ ఆఫీస్ 365 నిలుస్తోందని, అందుబాటులోకి తెచ్చిన కొద్దికాలంలోనే 2 బిలియన్ డాలర్లకుపైగా వ్యాపారాన్ని సాధించినట్లు కూడా ఆయన వెల్లడించారు. కాగా, మాల్స్‌లో నేవిగేషన్‌కు ఉపయోగపడే వెన్యూ మ్యాప్స్‌ను కూడా మైక్రోసాఫ్ట్ ఈ సందర్భంగా ప్రదర్శించింది. నోకియా మ్యాప్స్ అప్లికేషన్‌తో పాటు బింగ్ ద్వారా కూడా సంబంధిత డేటా లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులతోపాటు దేశంలోని 120 మాల్స్‌కు సంబంధించిన డేటాను ఈ అప్లికేషన్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది.

Advertisement
Advertisement