పన్ను ఆదాకు చక్కని పథకం | Sakshi
Sakshi News home page

పన్ను ఆదాకు చక్కని పథకం

Published Mon, Jan 6 2020 6:32 AM

Mirae Asset Tax Saver Fund ELSS funds - Sakshi

పెట్టుబడులపై అధిక రాబడులను పొందే అవకాశం.. అదే సమయంలో సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా.. ఈ ప్రయోజనాలు ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల నుంచి పొందొచ్చు.  ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో మంచి పనితీరు చూపిస్తున్న టాప్‌ పథకాల్లో మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ కూడా ఒకటి. ఈఎల్‌ఎస్‌ఎల్‌ పథకాల్లో చేసే పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్‌ ఉంటుంది. అంటే ఆ లోపు వాటిని వెనక్కి తీసుకు నే అవకాశం ఉండదు. దీర్ఘకాల లక్ష్యాల కోసం, పిల్లల ఉన్నత చదువుల కోసం, రిటైర్మెంట్‌ కోసం ఈ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. 
 
రాబడులు..: ఈ పథకం 2015 డిసెంబర్‌లో ప్రారంభం అయింది. నాటి నుంచి నేటి వరకు మెరుగైన రాబడులనే ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 13.1 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షిక రాబడులు 17.7 శాతంగా ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్‌ఈ 200 టీఆర్‌ఐ (టోటల్‌ రిటర్న్‌ ఆన్‌ ఇండెక్స్‌) రాబడులు ఏడాదిలో కేవలం 9 శాతంగా, మూడేళ్లలో వార్షికంగా 14.1 శాతంగానే ఉండడం గమనార్హం. ప్రారంభించిన రోజు నుంచి చూస్తే ఇప్పటి వరకు సగటున వార్షికంగా 18.69 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.1 లక్ష ఇన్వెస్ట్‌ చేసి ఉంటే ఇప్పటికి రూ.1.65 లక్షలు సమకూరేది. 2016, 2017లో పన్ను ఆదా విభాగం సగటు రాబడులను మించి పనితీరు చూపించిన ఈ పథకం, 2018 మార్కెట్‌ కరెక్షన్‌ సమయంలో నష్టాలను పరిమితం చేసింది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగంలో నష్టాలు సగటున 6 శాతంగా ఉండగా, మిరే అస్సెట్‌ ట్యాక్స్‌ సేవర్‌ పథకంలో నష్టాలు 2.3 శాతానికే పరిమితమయ్యాయి.   

పెట్టుబడుల విధానం..: 2017 నుంచి ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 99 శాతం పెట్టుబడులకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ ఉంది. నగదు నిల్వలు కేవలం ఒక శాతం లోపునే ఉన్నాయి. ఈ పథకం బ్యాంకింగ్‌ రంగానికి పెద్ద పీట వేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగంలోని స్టాక్స్‌లో 37 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత 12 శాతం మేర ఎనర్జీ రంగంలో, ఎఫ్‌ఎంసీజీలో 10 శాతం, హెల్త్‌కేర్‌లో 8 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. కన్‌స్ట్రక్షన్, టెక్నాలజీ రంగ స్టాక్స్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. మార్కెట్‌ విలువ పరంగా ఎటువంటి స్టాక్స్‌లో అయినా ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలకు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 54 స్టాక్స్‌ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం భారీ లార్జ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో 70% వరకు పెట్టుబడులు కలిగి ఉంది. మిడ్‌క్యాప్‌ 25%, స్మాల్‌ క్యాప్‌నకు 5 శాతం వరకు పెట్టుబడులు కేటాయించింది.

Advertisement
Advertisement