తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయ్.. | Sakshi
Sakshi News home page

తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయ్..

Published Mon, Jun 23 2014 12:19 AM

తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయ్.. - Sakshi

  • ఎఫ్ అండ్ వో ముగింపు ఎఫెక్ట్
  •  ఆయిల్ ధరల కదలికలూ కీలకమే
  •  ఈ వారం మార్కెట్ ట్రెండ్‌పై
  •  నిపుణుల అంచనాలు
  • న్యూఢిల్లీ: రుతుపవనాల పురోగతి, ఇరాక్ అంతర్యుద్ధం కారణంగా వేడెక్కిన ఆయిల్ ధరలు వంటి అంశాల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు  ఒడిదుడుకులను చవిచూస్తాయని స్టాక్ నిపుణులు అంచా వేశారు. వీటికితోడు గురువారం(26న) జూన్ నెల ఎఫ్ అండ్ వో సిరీస్ ముగియనున్నందున ప్రధాన ఇండెక్స్‌లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయని అభిప్రాయపడ్డారు. జూన్ డెరివేటివ్ పొజిషన్లను ట్రేడర్లు రోల్‌ఓవర్ చేసుకోవడం కూడా ఇందుకు కారణంగా నిలవనుందని పేర్కొన్నారు. ఇక మరోవైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల కదలికలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల తీరు కూడా దేశీ ఇండెక్స్‌లను ప్రభావితం చేస్తాయని తెలిపారు.
     
    భారీ పొజిషన్లు వద్దు
    గడిచిన శుక్రవారం మార్కెట్లు రెండు వారాల కనిష్టానికి దిగివచ్చాయి. ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 25,105 వద్ద, ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 7,511 పాయింట్ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, వచ్చే వారం ఎఫ్ అండ్ వో కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు గురవుతాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అభిప్రాయపడ్డారు. అత్యధిక స్థాయిలో ఒడిదుడుకులకు లోనయ్యే కౌంటర్లకు దూరంగా ఉండటమే మేలని, ఇదే విధంగా గరిష్ట స్థాయిలో ట్రేడర్లు  పొజిషన్లు తీసుకోవడం సమర్థనీయం కాదని సూచించారు.  
     
    ధరల పెరుగుదలకు అవకాశం
    ఈ వారం మార్కెట్లకు రుతుపవనాలు కీలకంగా నిలవనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఆహారోత్పత్తి తగ్గుతుందని, ఇది ధరల పెరుగుదలకు దారితీస్తుందని చెప్పారు. ఇది ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తుందని తెలిపారు. రుతుపవనాలు ఇప్పటికే దేశంలో సగభాగం వ్యాపించినప్పటికీ 4 రోజులు ఆలస్యమైన విషయం విదితమే. దీంతో జూన్ 1-18 మధ్య సాధారణంకంటే 45% తక్కువగా వర్షాలు పడ్డాయి. వెరసి ఇకపై వీటి పురోగమనం దేశీయంగా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనుందని మాంగ్‌లిక్ వ్యాఖ్యానించారు.
     
    బడ్జెట్‌పై దృష్టి
    ఇకపై రుతుపవనాల కదలికలతోపాటు, జూలై రెండో వారంలో వెలువడనున్న వార్షిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ దీపేన్ షా చెప్పారు. సమీప కాలానికి ఈ రెండు అంశాలే మార్కెట్లకు దిశను నిర్దేశిస్తాయని తెలిపారు. ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతోపాటు, ఇతర సంస్కరణలను ప్రకటిస్తే దేశీ మార్కెట్లు ఇతర వర్ధమాన మార్కెట్లకు మించి దూసుకెళతాయని అభిప్రాయపడ్డారు. అయితే ముడిచమురు ధరల పెరుగుదల కొనసాగితే కరెంట్ ఖాతాలోటు, రూపాయి, ద్రవ్యోల్బణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
     
    అమెరికా గణాంకాలు...
    ఈ వారం అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలు వెలువడనున్నాయి. మే నెలకు వినియోగ వస్తు రంగ ఆర్డర్లు, హౌసింగ్ అమ్మకాలు, వినియోగదారుల విశ్వాస సూచీ తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. కాగా, ఇరాక్‌లో చెలరేగిన అంతర్యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 115 డాలర్లను తాకడంతో దేశీయంగా ఆందోళనలు పెరిగాయి. చమురు అవసరాలకు విదేశాలపై అధికంగా ఆధారపడటంతో దిగుమతుల బిల్లు పెరిగి దేశీ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందన్న అంచనాలు గత వారం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ వరుసగా రెండో వారం కూడా నష్టాలతో ముగిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement