హార్వర్డ్ లో నా బెస్ట్ మెమరీ అదే: జుకర్ బర్గ్ | Sakshi
Sakshi News home page

హార్వర్డ్ లో నా బెస్ట్ మెమరీ అదే: జుకర్ బర్గ్

Published Fri, May 26 2017 5:23 PM

హార్వర్డ్ లో నా బెస్ట్ మెమరీ అదే: జుకర్ బర్గ్

ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సరిగ్గా 12 ఏళ్ల తర్వాత తన హార్వర్డ్ డిగ్రీని తాను సంపాదించుకున్నారు. హార్వ‌ర్డ్‌లో చ‌దువుకుని డ్రాప్‌ అవుట్‌గా బ‌య‌ట‌కు వెళ్లిన జుక‌ర్‌బ‌ర్గ్‌ తిరిగి ఇదే యూనివ‌ర్సిటీ నుంచి గురువారం గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. 2004లో యూనివర్సిటీని వీడిన జుకర్ బర్గ్, తన అద్భుతమైన ప్రతిభతో బిలియనీర్‌గా అవతరించి 2017లో యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ప్రసగించడం విశేషంగా నిలిచింది. ఈ ప్రసంగంలో హార్వర్డ్ యూనివర్సిటీలో తన బెస్ట్ మెమరీని విద్యార్థులతో పంచుకున్నారు. తన భార్య ప్రిస్ సిల్లా చాన్ ను కలవడం హార్వర్డ్ లో తన బెస్ట్ మెమరీగా చెప్పారు. ప్రిస్ సిల్లాతో ఆ పరిచయాన్ని ఎంతో సంతోషంతో పంచుకున్నారు.
 
'' అప్పుడే ఫేస్ మ్యాష్ అనే వెబ్ సైట్ ను లాంచ్ చేశాను. అడ్మినిస్ట్రేటివ్ బోర్డు నన్ను చూడాలనుకుందని తెలిసింది. ఇక అందరూ నన్ను ఆ యూనివర్సిటీ నుంచి బయటికి పంపేస్తారని అనుకున్నారు. యూనివర్సిటీలో నా సామన్లంతా సర్దడానికి నా తల్లిదండ్రులు కూడా వచ్చేస్తున్నారు. ఆ సమయంలో స్నేహితులు వీడ్కోలు పార్టీ ఏర్పాటుచేశారు. ఎవరికి తెలుసు? ఆ సమయంలో అదృష్టం మనవెన్నంటే ఉంటుందని.
 
ప్రిస్ సిల్లా కూడా వాళ్ల స్నేహితులతో ఆ పార్టీకి వచ్చింది. ఫోహో బెల్ టవర్ లో బాత్రూమ్ కోసం వేచిచూస్తున్న లైన్ లో మేము కలుసుకున్నాం. ఆల్ టైమ్ మోస్ట్ రొమాంటిక్ లైన్స్ ను నేను ప్రిస్ సిల్లాతో చెప్పా. ఇంకో మూడు రోజుల్లో నేను వెళ్లిపోతున్నా. వెంటనే మనం డేట్ కి వెళ్దామా అని అడిగేశా'' అని మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు. జుకర్ బర్గ్ తన బెస్ట్ మెమరీగా ఆ తీపి జ్ఞాపకాలను పంచుకుంటున్న సమయంలో ప్రిస్ సిల్లా ఎంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.     

Advertisement

తప్పక చదవండి

Advertisement